Pandit Birju Maharaj : భారత దేశం మరో కళాకారుడిని కోల్పోయింది. అంతా పండిట్ జీ అని పిలుచుకునే బిర్జూ మహారాజ్ 83 ఏళ్ల వయసులో ఢిల్లీలోని తన స్వగృహంలో గుండె పోటుతో మరణించారు.
కథక్ కళా రూపంలో ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తో సత్కరించింది. తన మనవళ్లతో ఆడుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి పడి పోయాడు.
ఆస్పత్రికి తరలించగా అప్పటికే చని పోయినట్లు వైద్యులు నిర్ధారించారని బిర్జూ మహారాజ్ (Pandit Birju Maharaj )మనుమరాలు రాగిణి మహారాజ్ వెల్లడించారు.
గత కొంత కాలంగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నారు. డయాలసిస్ చికిత్స చేస్తూ వస్తున్నారు. బిర్జూ మహారాజ్ కథక్ నృత్యకారుల మహారాజ్ కుటుంబానికి చెందిన వారు.
కథక్ నృత్యంలోనే కాదు మంచి డ్రమ్మర్ కూడా. దాదాపు అన్ని డ్రమ్స్ లను సులభంగా వాయించే నైపుణ్యం కలిగి ఉన్నారు బిర్జూ మహారాజ్. నృత్య కళాకారుడే కాదు అద్భుతమైన గాయకుడు కూడా.
తుమ్రీ, దాద్రా, భజన్, గజల్ పై మంచి పట్టు కలిగి ఉన్నారు. తన జీవితంలోని సంఘటనలను ఆధారంగా చేసుకుని ప్రదర్శనలు చేపట్టాడు.
ఆయన మరణంతో దేశంలోని ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బిర్జూ మహారాజ్ (Pandit Birju Maharaj )మరణం యావత్ కళా ప్రపంచానికి తీరని లోటు అని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
భారతీయ నృత్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఆయన లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నానని అన్నారు. దేశం నిబద్ధత కలిగిన కళాకారుడిని కోల్పోవడం బాధాకరమన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
ప్రముఖ పాకిస్తాన్ సింగర్ అద్నాన్ సమీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కళా నైపుణ్యం, మేధా శక్తి ద్వారా అనేక తరాలను ప్రభావితం చేశారని కొనియాడారు.
Also Read : యాదాద్రి అద్బుతం ఆధ్యాత్మిక సౌరభం