Kinnera Mogulaiah : నిన్నటి దాకా తెలుగు వారికి పరిచయమైన ఉమ్మడి పాలమూరు మట్టి పరిమళం కిన్నెర మొగిలయ్య ఇప్పుడు దేశమంతటా గుర్తించే స్థాయికి ఎదిగారు.
ఇవాళ భారత ప్రభుత్వం అత్యున్నత ప్రతిభావంతులైన దేశం గర్వించ దగిన పరిమళాలకు పద్మ పురస్కారాలు ప్రకటించింది.
తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట పల్లెటూరు స్వస్థలం. పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ తో వెలుగులోకి వచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తన కిన్నెర వాయిద్య పరికరంతో ఓ వెలుగు వెలిగారు మొగిలయ్య(Kinnera Mogulaiah).
భారతీయ సంగీత ప్రస్థానంలో కిన్నెర వాయిద్యం కు ఓ విశిష్టమైన స్థానం ఉంది.
ప్రముఖ పరిశోధకుడు జయధీర్ తిరుమల్ రావు పుణ్యమా అని తెలంగాణలో అక్కరకు రాకుండా పోయిన కళల్ని వెతికి పట్టే పనిలో సక్సెస్ అయ్యారు.
ఇందులో భాగంగా వేలాది మంది కళాకారుల్ని గుర్తించి పరిచయం చేశారు.
ఈ తరుణంలో ఒక్కసారిగా తనదైన ప్రతిభతో సునామీలా దూసుకు వచ్చారు మొగిలయ్య.
తన తండ్రి, తాత ముత్తాల నుంచి వారసత్వంగా సంక్రమించిన కిన్నెర వాయిద్యంతోనే బతుకు బండిని లాగిస్తూ వచ్చారు మొగిలయ్య. కిన్నెర వాయిద్యకారులు కొంత మంది మాత్రమే మిగిలి ఉండడం బాధాకరం.
కథను చెప్పడంలో, వీర గాథల్ని వినిపించడంలో కిన్నెర వాయిద్యానిది ప్రత్యేకం. మొగిలయ్యతో పాటు మంబాపూర్ గ్రామానికి చెందిన డక్కలి బాలమ్మ కిన్నెరతో సహవాసం చేసింది.
ఆమె 2018 డిసెంబర్ లో కాలం చేసింది. ఆమె అంత్యక్రియల కోసం గ్రామస్థులే డబ్బులు పోగు చేసుకుని నిర్వహించారు. ఈ దేశంలో కేవలం కిన్నెర వాయించే వాళ్లు కేవలం 12 మంది మాత్రమే ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఈ కిన్నెర అనేది డక్కలి, చెంచు వంటి సంచార జాతులకు చెందిన తీగ వాయిద్యం. కిన్నెర ప్రదర్శనలో గాత్రం, సంగీతం ప్రాధాన్యత కలిగి ఉంటుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12వ శతాబ్ధం నుంచి కిన్నెర వాయిద్యాన్ని డక్కలికి చెందిన వారు వాయిస్తూ వస్తున్నారని తెలిపారు జయధీర్ తిరుమలరావు.
మాదిగ కులానికి ఉప కులం డక్కలి కులం. ఒకప్పుడు వీరిని అంటరానివారుగా చూశారు. ఈ కిన్నెర (Kinnera Mogulaiah )వాయిద్యం వారిని సమాజంలో కలిసి పోయేలా చేసింది.
చారిత్రక సంఘటనలు, స్థానిక నాయకుల జీవితాలు, జాంబ పురాణం నుంచి కొంత కిన్నెర వాయిద్యం తో చెప్పటం జరుగుతూ వస్తోంది. తెలంగాణలోని పాలమూరు, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో కిన్నెర వాయిద్య కారులు ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం దర్శనం మొగిలయ్య కిన్నెర వాయిద్యకారుడిగా పేరొందారు. ఉగాది పురస్కారం అందుకున్నాడు. పిల్లలు చదువుకునే పుస్తకంలో ఆయన గురించి ఓ పాఠం కూడా ఉంది.
ఇదే పాలమూరు జిల్లాకు చెందిన పోచయ్యను కూడా సన్మానించారు అప్పట్లో. తెలంగాణ సర్కార్ మొగిలయ్యకు గుర్తింపు ఇచ్చింది.
Also Read : సినీ వాలిలో కవితా గానామృతం