Ramanujacharya : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల(Ramanujacharya) విగ్రహ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది.
ఎక్కడ చూసినా భక్తులే. జై శ్రీమన్నారాయణ అంటూ వేలాది మంది భక్తులు నినదించారు. తమ ఆరాధ్య దైవమైన సమతామూర్తిని తిరుమంత్రాన్ని జపిస్తూ ముందుకు సాగారు.
ఆ ప్రాంతమంతా శోభాయమానంగా మారి పోయింది. చూసేందుకు కన్నులు కూడా చాలవన్నట్లుగా మారి పోయింది. ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టి పడేలా తీర్చి దిద్దారు. శ్రీరామనగరం భక్త వైభవాన్ని సంతరించుకుంది.
వెయ్యేళ్ల కిందట ఈ పవిత్ర భూమిపై జన్మించిన శ్రీ రామానుజాచార్యుల (Ramanujacharya)జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకం. ఆ తర్వాత అదే వెయ్యేళ్ల అనంతరం ఆయనను స్మరించుకుంటూ, ఆయన అందించిన సమతా సూత్రాన్ని ఈనాటి తరాలకు అందించాలని రేపటి తరం గుర్తు పెట్టుకునేలా ఉండాలని ఇక్కడే 216 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి సత్ సంకల్పం వల్ల ఇక్కడ కొలువు తీరింది. 5 వేల మందికి పైగా రిత్వికులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈనెల 14 వరకు మహోత్సవాలు కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా భారీ ఎత్తున శోభాయాత్రను నిర్వహించారు. భక్తులు , పండితులు, పామరులు సైతం పాల్గొన్నారు. తెలుగు వారి సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు.
ఇది ఒక రకంగా నిజమైన భక్తి పండుగ ప్రారంభమైందని అన్నారు చినజీయర్ స్వామి. నిజమే శ్రీరామనగరం ఇప్పుడు సప్త వర్ణ శోభితంతో అలరారుతోంది.
అన్ని దారులు శ్రీరామనగరం వైపు వెళుతుండడం విశేషం.
Also Read : ఆధ్యాత్మిక సౌరభం సమతా కేంద్రం