Punjab CM : అవినీతి సహించను అక్రమాలు ప్రోత్సహించను
అవినీతి రహిత పంజాబ్ నా లక్ష్యమన్న సీఎం
Punjab CM : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతి రహిత రాష్ట్రంగా పంజాబ్ ను మార్చడమే తన ముందున్న లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తాను ఆ పార్టీపై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు.
రాష్ట్రాన్ని జలగల్లా పీడించి పీల్చి పిప్పి చేశారని, రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారంటూ ఆరోపించారు భగవంత్ మాన్(Punjab CM). లంచం కేసులను ఎదుర్కొంటున్న తమ నాయకులకు అనుకూలంగా సీఎం ఇంటి ముందు పార్టీకి చెందిన శ్రేణులు, నాయకులు ఆందోళన చేపట్టారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు భగవంత్ మాన్(Punjab CM). ఈ నిరసన, ఆందోళనలు చేయడం అంటే దోపిడీదారులకు, అవినీతి , అక్రమార్కులకు మీరంతా మద్దతు తెలిపినట్లే అవుతుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే దోపిడీ అన్నది, లంచం తీసుకోవడం అన్నది ఉందని ఆరోపించారు సీఎం. రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన వారైనా సరే తాను అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తి లేదన్నారు.
అక్రమాలకు పాల్పడితే వారు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా సరే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదే సమయంలో ఆప్ సర్కార్ లో మంత్రిగా ఉన్న విజయ్ సింగ్లాను అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీఎం సస్పెండ్ చేశారు. ఇది దేశంలోనే సంచలనం కలిగించింది.
ఇప్పటికే సీఎం టోల్ ఫ్రీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే నేరుగా తనకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Also Read : దేశ్ ముఖ్..మాలిక్ కు బిగ్ షాక్