Raosaheb Patil Danve : శివసేన ఎమ్మెల్యేలు మాతో టచ్ లో లేరు
కేంద్ర మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే
Raosaheb Patil Danve : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో కూడిన మహా వికాస్ అఘాడీ (ఎంవిఏ) ప్రభుత్వం మైనార్టీలో పడింది.
శివసేన పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఏక్ నాథ్ షిండే ధిక్కార స్వరం వినిపించారు. తనతో పాటు 34 మంది ఎమ్మెల్యేలతో కలిసి మకాం మార్చారు.
మొదట గుజరాత్ లోని సూరత్ హోటల్ లో ఉన్నారు. అనంతరం సీన్ ను అస్సాం లోని గౌహతికి మార్చేశారు. అందులోంచి ఒక ఎమ్మెల్యే నితీష్ దేశ్ ముఖ్ బయటకు వచ్చారు.
తాను ఉద్దవ్ ఠాక్రే వైపు ఉంటానని స్పష్టం చేశారు. దీంతో తన వైపు 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ ప్రకటించారు ఏక్ నాథ్ షిండే. ఈ మేరకు 38 మంది ఎమ్మెల్యేలతో కూడిన లేఖను రాష్ట్ర గవర్నర్ కోషియార్ , డిప్యూటీ స్పీకర్ కు లేఖలు పంపించారు.
దీంతో ఎవరు కొలువు తీరుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరో వైపు ఈ మొత్తం తతంగానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనంటూ సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.
ఈ విమర్శల్ని తిప్పి కొట్టారు కేంద్ర మంత్రి రావు సాహెబ్ పాటిల్ దన్వే(Raosaheb Patil Danve). శివసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో లేరని స్పష్టం చేశారు.
గురువారం ఆయన మహారాష్ట్ర బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి మాట్లాడారు. అది వారి అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు. తమకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలం కూడా ఉందని స్పష్టం చేశారు.
Also Read : మరాఠా సీఎంగా ఏక్ నాథ్ షిండే ..?