AAP Dilemma Comment : ఆత్మ ర‌క్ష‌ణ‌లో ఆప్

కేజ్రీవాల్ వ‌ర్సెస్ మోదీ నిజ‌మేనా

AAP Dilemma Comment : రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి చూసేందుకు. కానీ అది చ‌ద‌రంగాన్ని ఇష్ట‌పడే వాళ్ల‌కు..లేదా ఆడే వాళ్ల‌కు మాత్ర‌మే అర్థ‌మ‌వుతుంది. ర‌న్నింగ్ రేస్ ను ప‌క్క‌న పెడితే మోదీ ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ‌డం అన్న‌ది ఇప్పుడు ఒక స‌వాల్ గా మారింది.

ప్ర‌తిపక్షాలలో నెల‌కొన్న ఆధిప‌త్య ధోర‌ణి, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని భావ‌జాలాల మ‌ధ్య ఉమ్మ‌డిగా ఒకే వేదిక పైకి వ‌చ్చే అవ‌కాశం లేదు. అందుకే ఎవ‌రికి వారే త‌మ త‌మ మార్గాల‌ను ఎంచుకుంటున్నారు. త‌మదైన పంథాను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. వీరిలో ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని అనుకునే వారే. పైకి లేద‌ని అనుకున్నా అంతిమ గోల్ మాత్రం అదే. 

మిగ‌తా నాయ‌కుల‌కు మోదీకి ఉన్న తేడా అదే. ఇవాళ బీజేపీ ఆక్టోప‌స్ లాగా విస్త‌రించింది. కానీ దేశ రాజ‌ధాని ఢిల్లీని చేజిక్కించు కోలేక పోయింది. ఇదే మోదీని, ట్ర‌బుల్ షూట‌ర్ అమిత్ షాను బాధిస్తోంది. అందుకే ప‌దే ప‌దే ఢిల్లీ టార్గెట్ అవుతోంది. 

2014 కంటే దేశంలో ప‌రిస్థితులు వేరు..ఆ త‌ర్వాత మోదీ ప్ర‌ధానిగా కొలువు తీరాక సీన్ మారింది..సిట్యూయేష‌న్ కూడా సీరియ‌స్ అయి పోయింది. ఉంటే ప్ర‌ధాని లేదంటే ఎవ‌రూ ఉండ కూడ‌ద‌నే స్థాయికి చేరుకుంది. 

ఇది ప్ర‌జాస్వామ్యంలో ఉండ కూడ‌ని భావ జాలం. అంబేద్క‌ర్ ఆనాడే చెప్పాడు. మెజారిటీ ఇచ్చింది అసంబ‌ద్ద లేదా ప్ర‌జ‌ల‌కు వ్య‌తిరేక‌మైన నిర్ణ‌యాలు తీసుకునేందుకు కాదు. కానీ స‌మాజానికి, దేశానికి జ‌వాబుదారీగా ఉండేలా పాల‌న సాగించాల్సిన బాధ్య‌త ప్రభుత్వంపై ఉంది.

ఇప్పుడు ఇందుకు పూర్తిగా విరుద్దంగా జ‌రుగుతోంది. ప్ర‌త్యేకించి రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌పై ప‌దే ప‌దే దాడులు జ‌రుగుతున్నాయి. లెక్క‌లేన‌న్ని ప్ర‌శ్న‌లు కురుస్తున్నాయి. ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కేంద్రం వ‌ర్సెస్ సుప్రీంకోర్టు.

ఒకానొక ద‌శ‌లో సీజేఐ చేసిన కామెంట్స్ ఇప్పుడున్న అంత‌ర్గ‌త ఎమ‌ర్జెన్సీని గుర్తుకు తెస్తుంది. అదేమిటంటే ఈ దేశంలో కేసులు..జైళ్లు..బెయిల్స్ కే ఉన్న స‌మ‌యం స‌రిపోతోంద‌ని. ఇది క్షేమక‌రం కాదు..డెమోక్ర‌సీకి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని హెచ్చ‌రిక‌. 

తాజాగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు మ‌రింత ఆస‌క్తిని రేపుతున్నాయి. ఎంసీడీ ఎన్నిక‌ల్లో ఆప్ విజ‌యం సాధించింది. మ‌రో వైపు ఢిల్లీ లిక్క‌ర్ స్కాం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గ‌తంలో ఉన్న ఎల్జీ కంటే ప్ర‌స్తుతం కొలువు తీరిన ఎల్జీ స‌క్సేనా తో సీఎంకు పొస‌గ‌డం లేదు. 

చివ‌ర‌కు వివాదం సుప్రీంకోర్టు దాకా చేరింది. స‌ర్వోన్న‌త న్యాయ స్థానం జోక్యం చేసుకుంటే కానీ మేయ‌ర్ , డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక జ‌ర‌గ‌లేదు. 

ఇక స్టాండింగ్ క‌మిటీ స‌భ్యుల ఎన్నిక కిష్కింద‌కాండ‌ను త‌ల‌పింప చేసింది. ఆప్ కు(AAP Dilemma) అన్నీ తానై ఉంటూ వ‌చ్చిన కేజ్రీవాల్ కు లెఫ్ట్ అండ్ రైట్ గా ఉన్న స‌త్యేంద్ర జైన్ తో పాటు సిసోడియా అరెస్ట్ కావ‌డం కోలుకోలేని షాక్ . 

సిసోడియా త‌న‌కు ఏ పాపం తెలియ‌దంటున్నారు. ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచే కుట్ర జ‌రుగుతోందా అన్న అనుమానం త‌లెత్తుతోంది. 2015 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 70 సీట్ల‌కు గాను 67 సీట్లు గెలుచుకుంది ఆప్. ఆనాటి నుంచి నేటి దాకా మోదీకి కంట్లో న‌లుసుగా కెలుకుతోంది ఢిల్లీ. ఇక సిసోడియా మామూలోడు కాదు. 

పార్టీ లోనూ స‌ర్కార్ లోనూ రెండో ప్లేస్ లో ఉన్నాడు. 18 శాఖ‌లు చేప‌ట్టాడు. విద్యా, ఆరోగ్య రంగాన్ని బ‌లోపేతం చేశాడు. మంత్రి కాక ముందు సిసోడియా పోస్ట‌ర్ బాయ్. అన్నా హ‌జారే ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించాడు. 

ఆ త‌ర్వాత పంజాబ్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో సైతం ఆప్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇది విస్తు పోయేలా చేసింది. ఒక ఆశా జ్యోతిగా క‌నిపించింది ఆప్(AAP Dilemma Comment). కానీ ఇప్పుడు అదే ఆప్ పై పెట్టుకున్న ఆశ‌లు కూలుతున్న‌ట్లు అనిపిస్తోంది. 

విచిత్రం ఏమిటంటే ఆప్ త‌న ప‌రిధిని దాటి ఎప్పుడైతే ఇత‌ర రాష్ట్రాల‌లో పాగా వేయాల‌ని ప్లాన్ చేసిందో అప్ప‌టి నుంచే అవినీతి మ‌ర‌క‌లు అంట‌డం ప్రారంభ‌మైంది. ఇందులో భాగ‌మే మ‌ద్యం పాల‌సీ ఉచ్చు.

అయితే సిసోడియా పాత్ర గురించి స్ప‌ష్టంగా తెలియ‌క పోయినా సీబీఐ , బీజేపీ లేవ‌దీసిన ప్ర‌శ్న‌ల‌కు ఆప్ స‌రిగా స‌మాధానాలు చెప్ప‌లేక పోతోంది. ఇందుకోస‌మే కేంద్రం వేచి చూస్తోంది. ప్ర‌స్తుతం ఆప్ త‌న‌ను తాను ర‌క్షించుకునే ప‌నిలో ప‌డింది. ఇదే కేంద్రానికి ..మోదీకి..షాకు కావాల్సింది.

Also Read : దేశ సంక్షేమం కోసం సామూహిక ఉద్యమం

Leave A Reply

Your Email Id will not be published!