Krishnamraju : రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇక లేరు
శోకసంద్రంలో తెలుగు సినీ లోకం
Krishnamraju : ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు (Krishnamraju) కన్ను మూశారు. ఆయనకు 83 ఏళ్లు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.
హైదరాబాద్ గచ్చి బౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 3.25 గంటలకు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తన తమ్ముడి తనయుడే ప్రముఖ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. కృష్ణంరాజు మృతి పట్ల తెలుగు సినీ లోకం విషాదం నెలకొంది.
సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. కృష్ణంరాజు స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు.
1940 జనవరి 20న పుట్టారు. విజయనగర సామ్రాజ్య వంశస్థుల కుటుంబంలో పుట్టారు. కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.
చదువు అనంతరం జర్నలిస్టుగా కొంత కాలం పాటు పని చేశారు. 1966లో చిలకా గోరింకా మూవీతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణం రాజు మొదట్లో ప్రతి నాయకుడిగా గుర్తింపు పొందారు.
అవేకళ్లు సినిమాలో విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 183 కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు(Krishnamraju) నటించిన చిత్రాల్లో తనకు పేరు తీసుకు వచ్చిన చిత్రాల్లో భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న ఉన్నాయి.
తన కెరీర్ లో తనయుడు ప్రభాస్ నటించిన చివరి చిత్రం రాధా శ్యామ్ లో నటించారు. నిర్మాతగా గోపీకృష్ణ బ్యానర్ లో పలు సినిమాలు రూపొందించారు. ఆయనను పలు అవార్డులు, పురస్కారాలు వరించాయి.
ఇక పాలిటిక్స్ పరంగా చూస్తే 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎంపీగా గెలుపొందారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పని చేశారు కృష్ణం రాజు. ఒక విలక్షణ నటుడిని కోల్పోయింది తెలుగు సినిమా రంగం.
Also Read : క్వీన్ ను తలుచుకున్న కమల్ హాసన్