Actor Vijay Comment : ‘విజయ్’ కలకలం కానుందా సంచలనం
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా
Actor Vijay Comment : ప్రాంతీయ అభిమానమే కాదు విపరీతమైన ఆత్మాభిమానానికి పెట్టింది పేరు తమిళనాడు. తమ గురించి ఏమైనా అంటే ఒప్పుకుంటారు..సహిస్తారు..భరిస్తారు..వీలైతే దెబ్బలు తింటారు. కానీ తమ ప్రాంతం గురించి, తమ భాష, నాగరికత, సంస్కృతి గురించి ఒక్క మాట జారినా తట్టుకోలేరు. అంతేనా తెగే దాకా పోరాడుతారు. అవసరమైతే ప్రాణాలు అర్పిస్తారు. అందుకే ఈ దేశంలో తమిళులది ప్రత్యేకమైన చరిత్ర. తమకు నచ్చితే గుళ్లు కడతారు. పూజలు చేస్తారు. తమ కుటుంబానికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఇక సినిమా హీరోలు, హీరోయిన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. తలైవా రజనీకాంత్ , కమల్ హాసన్ ఎవరికి వారే తమ తమ దారుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇంకొందరు వివిధ పార్టీలకు అనుసంధానంగా ఉంటున్నారు. కానీ కోలీవుడ్ లో విపరీతమైన స్టార్ డమ్ కలిగిన నటుల్లో తళపతి విజయ్(Vijay) ఒకడు. చిటికేస్తే చాలు లక్షల్లో అభిమానులు పోగవుతారు. తమ అభిమాన నటుడి కోసం అంతులేని అభిమానాన్ని చూపిస్తారు. ఎప్పటి నుంచో విజయ్ పాలిటిక్స్ లోకి వస్తాడని ప్రచారం జరిగింది. తన పేరు మీద ఏర్పాటు చేసిన అభిమాన సంఘాన్నే రాజకీయ పార్టీగా నమోదు చేయడం కలకలం రేపింది. తన తండ్రి చంద్రశేఖర్ పై ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అప్పట్లో.
విజయ్ ని అక్కడి వారంతా తళపతి అని పిలుచుకుంటారు. మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీఎస్టీ పై సెటైర్లు వేశారు. తన సినిమా ద్వారా ప్రశ్నించారు కేంద్రాన్ని. అప్పట్లో విజయ్ ఇళ్లపై, ఆఫీసులపై సోదాలు చేపట్టింది ఐటీ శాఖ. కానీ ఎక్కడా దొరకలేదు. ప్రతి పైసాకు లెక్క చెప్పే నైజం తనది అని ఇప్పటికే ప్రకటించాడు విజయ్(Vijay). ఇక దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఏకైక నటుడిగా కూడా గుర్తింపు పొందాడు. అత్యధిక పారితోషకం కూడా తీసుకుంటాడని ప్రచారం కూడా ఉంది. ఇది పక్కన పెడితే ఆయన గత కొన్నేళ్లుగా తన అభిమాన సంఘాల ద్వారా సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఆ సంఘాలు ఇప్పటికే తలమునకలై ఉన్నాయి. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో 10, 12 తరగతుల్లో టాప్ లో నిలిచిన , ప్రతిభావంతులైన విద్యార్థులకు జ్ఞాపికలు, నగదు బహుమానాలు అందజేశాడు స్వయంగా తళపతి విజయ్(Vijay).
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే మోదీ , బీజేపీ శ్రేణులు కాషాయ రాజ్యాంగాన్ని నిర్మించాలని చూస్తుంటే విజయ్(Vijay) మాత్రం భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, పెరియార్ లను తప్పక చదవాలని పిలుపునిచ్చాడు. ఓటు అన్నది అత్యంత విలువైనదని దాని గురించి విద్యార్థి దశలో ఉన్నప్పుడే అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశాడు. ప్రస్తుత రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. డబ్బులకు లొంగ వద్దని మీ పేరెంట్స్ కు చెప్పాల్సిన బాధ్యత మీదేనని స్పష్టం చేశాడు. ఓటుకు రూ. 1000 ఇస్తానన్న నాయకుడు ఎంత సంపాదించి ఉంటాడో ఆలోచించాలని హెచ్చరించాడు విజయ్. అంతే కాదు విద్యా వ్యవస్థలో కీలకమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నాడు. డబ్బులు పోతే సంపాదించు కోవచ్చు. అనారోగ్యం వస్తే బాగు చేయించు కోవచ్చు..కానీ ఆత్మాభిమానం, స్వేచ్ఛ కోల్పోతే బతికి ఉండి ఏమీ లాభం అని ప్రశ్నించాడు. అంతే కాదు చదువుపై ఫోకస్ పెట్టాలని సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించాడు. మీ నుంచి దేనినైనా దొంగిలించ వచ్చు..కానీ విద్యను మాత్రం తీసుకోలేరన్న సత్యాన్ని గుర్తించాలని అన్నాడు విజయ్(Vijay).
Also Read : Jairam Ramesh Modi : ప్రధానమంత్రి కాదు ప్రచారమంత్రి