Ajinkya Rahane Comment : గాయం విజ‌యానికి సోపానం

రూట్ మార్చిన ర‌హానే

భార‌త క్రికెట్ లో అజింక్యా ర‌హానే గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. కానీ ఎప్పుడూ కూల్ గా, సాఫ్ట్ గా , క‌ళాత్మ‌కంగా ఆడుతూ వ‌చ్చిన ర‌హానే ఉన్న‌ట్టుండి అరి వీర భ‌యంక‌ర‌మైన ఇన్నింగ్స్ ల‌తో విరుచుకు ప‌డ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తున్న భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ 16వ సీజ‌న్ లో ఊహించ‌ని రీతిలో స‌త్తా చాటుతున్నాడు అజింక్యా ర‌హానే.

ర‌హానే భార‌త క్రికెట్ జ‌ట్టులో చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వ‌హించాడు. అంతే కాదు త‌న సార‌థ్యంలో ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై ఇండియాకు అపూర్వ‌మైన విజ‌యాన్ని, సీరీస్ ను కైవ‌సం చేసుకుని చ‌రిత్ర సృష్టించాడు. ఆనాడు యావ‌త్ భార‌త జాతి ఉప్పొంగి పోయింది. కొన్నేళ్ల చ‌రిత్ర‌ను తిర‌గ రాసింది. ఆ త‌ర్వాత అనూహ్యంగా ఫామ్ కోల్పోయాడు. చివ‌ర‌కు అప్ప‌టి బీసీసీఐ బాస్ సౌర‌వ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఎవ‌రైనా స‌రే జ‌ట్టు లోకి రావాలంటే దేశీ వాళి టోర్నీలు, మ్యాచ్ ల‌లో ఆడాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశాడు.

త‌న క్రికెట్ కెరీర్ లో గ‌త కొంత కాలం అజింక్యా ర‌హానేను పూర్తిగా వెన‌క్కి నెట్టేసేలా చేసింది. ఎవ‌రైనా గాయ‌ప‌డితే ఆత్మ స్థైర్యాన్నికోల్పోతారు. కానీ అజింక్యా మాత్రం ముందుకే వెళ్లాల‌ని డిసైడ్ అయ్యాడు. త‌న‌ను తాను ప్రూవ్ చేసుకునే ప‌నిలో ప‌డ్డాడు. రేయింబవ‌ళ్లు క‌ష్ట‌ప‌డ్డాడు. తన‌కు ఏ మైదానం అయితే ప్రాణం పోసిందే అదే క్రీజులోనే క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆడ‌టం మొద‌లు పెట్టాడు. త‌ను ఏం కోల్పోయాడో వాటిని తిరిగి పొందాల‌ని డిసైడ్ అయ్యాడు.

కాలం గాయాల‌ను మాన్పుతుంది. కానీ జ్ఞాప‌కాల‌ను చెరిపి వేయ‌లేదు. ఆట ప‌రంగా ఎన్నో దేశాలు తిరిగాడు. అద్బుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడాడు. భార‌త జ‌ట్టుకు వెన్నెముక‌గా నిలిచాడు. చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాల‌ను భార‌త జ‌ట్టుకు సాధించి పెట్టాడు. కానీ ప్ర‌పంచం ఎప్పుడైనా గెలిచిన వాడికే జేజేలు ప‌లుకుతుంది. విజేత‌ల‌ను అక్కున చేర్చుకుంటుంది. గెలిచిన‌ప్పుడు సంతోష ప‌డ‌లేదు. ఉక్కిరి బిక్కిరికి లోన‌వ‌లేదు. ఓడి పోయిన‌ప్పుడు బాధ‌కు గురి కాలేదు ర‌హానే.

త‌న‌కు జీవితం నేర్పిన పాఠం ఒక్క‌టే ఒపిక‌తో ఉండ‌టం..స‌మ‌యం వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూడ‌టం. ఏదో ఒక రోజు మ‌న‌ద‌వుతుంద‌ని న‌మ్మాడు. ఈసారి ఐపీఎల్ వేలం పాట‌లో క‌నీస ధ‌ర‌కు అమ్ముడు పోయాడు. ఎవ‌రూ తీసుకునేందుకు ర‌హానేను ముందుకు రాలేదు. కానీ జార్ఖండ్ డైన‌మెంట్ ధోనీ ర‌హానేను న‌మ్మాడు. ప‌ట్టుప‌ట్టి తీసుకున్నాడు. కానీ ఎంఎస్ న‌మ్మ‌కం వ‌మ్ము కాలేదు. ఇవాళ ఐపీఎల్ లో యువ ఆట‌గాళ్లు విస్తు పోయేలా, క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు.

ఫాస్టెస్ట్ ఇన్నింగ్స్ ల‌తో దుమ్ము రేపాడు. అసాధార‌ణ‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు ర‌హానే. ప్రతి ఇన్నింగ్స్ లో త‌న‌దైన ముద్ర క‌న‌బ‌ర్చాడు. చుక్క‌లు చూపించాడు..త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ఇవాళ అజింక్యా ర‌హానే గాయాన్ని గుణ పాఠంగా మార్చుకున్నాడు. దానినే విజ‌యానికి సోపానంగా అడుగులు వేశాడు. నేటి యువ త‌రానికి ర‌హానే ఓ పాఠం కాదంటారా..

Leave A Reply

Your Email Id will not be published!