Ajinkya Rahane : అజింక్యా ర‌హానే అరుదైన రికార్డ్

ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ

Ajinkya Rahane : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో భాగంగా ముంబై లోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ముంబై ఇండియ‌న్స్ పై 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 157 ర‌న్స్ చేసింది. అనంత‌రం 158 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన చెన్నై సూప‌ర్ కింగ్స్ డేవిడ్ కాన్వే వికెట్ ను ప‌రుగులేమీ చేయ‌కుండానే కోల్పోయింది.

ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన అజింక్యా ర‌హానే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. పేస‌ర్లు, స్పిన్న‌ర్ల‌ను ఊచ‌కోత కోశాడు. క్లాసిక్ షాట్స్ తో అల‌రించాడు. రహానే కొట్టిన సిక్స‌ర్లు చూడ ముచ్చ‌ట‌గా ఉన్నాయి. కేవ‌లం 19 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డును అధిగ‌మించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ సీజ‌న్ లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం.

మ‌రో వైపు రుతురాజ్ గైక్వాడ్ 40 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. ఇక 34 ఏళ్ల అజింక్యా ర‌హానే(Ajinkya Rahane) ఈసారి వేలం పాట‌లో సీఎస్కే త‌ర‌పున ఆడుతున్నాడు. మొత్తం 27 బంతులు ఎదుర్కొన్న ర‌హానే 7 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 61 ప‌రుగులు చేశాడు. పీయూష్ చావ్లా చేతిలో చివ‌ర‌కు చిక్కాడు.

సూర్య కుమార్ యాద‌వ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ముగిసింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ లో అర్ష‌ద్ ఖాన్ బౌలింగ్ లో నాలుగు ఫోర్లు , ఒక సిక్స‌ర్ కొట్టాడు. ఈ ఒక్క ఓవ‌ర్ లోనే చెన్నైకి 23 ర‌న్స్ వ‌చ్చాయి. ర‌హానే, రుతురాజ్ క‌లిసి రెండో వికెట్ కు 82 ర‌న్స్ జోడించాడు.

Also Read : సంజూ శాంస‌న్ స్ట‌న్నింగ్ క్యాచ్

Leave A Reply

Your Email Id will not be published!