Akunuri Murali : జనం కోసం ధిక్కార స్వరం
సామాజిక తెలంగాణ కోసం ప్రయత్నం
Akunuri Murali : తెలంగాణ అంటేనే చైతన్యం. సబ్బండ వర్ణాలకు పుట్టినిల్లు. ఇక్కడ మొలకెత్తే ఏ విత్తనమైనా అది నిటారుగా నిలబడుతుంది. ధిక్కార స్వరాన్ని వినిపిస్తుంది. చంపినా మళ్లీ మళ్లీ ఏదో ఒక రూపంలో నినాదమై వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి ఎన్నో గొంతులు చరిత్రగతిలో కలిసి పోయాయి. ఇంకొన్ని అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉన్నాయి.
ఈ దేశంలో తెలంగాణ అంటేనే పోరాటాల పురిటి గడ్డ. ఎన్నో ఉద్యమాలకు పెట్టింది పేరు. ఎన్నో బలిదానాలు, మరెన్నో ఆత్మ హత్యల సాక్షిగా ఏర్పడిన తెలంగాణలో సామాజిక వివక్ష కొనసాగుతూనే ఉందని ప్రశ్నిస్తున్న గొంతుకల్లో ప్రధానంగా వినిపిస్తున్న ఏకైక పేరు ఆకునూరి మురళి(Akunuri Murali) .
నిమ్న కులానికి చెందిన వ్యక్తి కావడం వల్లనేమో అడుగడుగునా వివక్షను ఎదుర్కొన్నారు. కానీ ఏనాడూ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అన్నది ఎండమావిగా మారిందని, ఇది దోపిడీకి, దౌర్జన్యాలకు, అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా నిలిచి పోయిందని ఆవేదన చెందారు. ప్రజల్ని ప్రేమించేందుకు, సేవ చేసేందుకు హోదాలతో పనేంటి అంటూ ప్రశ్నించాడు.
ఆకునూరి మురళి దేశంలో పేరొందిన నిజాయితీ కలిగిన ఐఏఎస్ లలో ఒకడిగా గుర్తింపు పొందారు. ప్రపంచ బ్యాంకులో పని చేశాడు. ఎన్నో ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వామగా ఉన్నారు. మహిళా సంఘాలను ఏర్పాటు చేయడంలో, వారిని సమాజంలో కీలకమైన వ్యక్తులుగా తీర్చి దిద్దడంలో, వారి కాళ్ల మీద వాళ్లను నిలబడేలా చేయడంలో ఆకునూరి మురళి పాత్ర ఎంతో ఉందన్నది వాస్తవం.
ఉన్నతాధికారిగా ఇంకా సర్వీసు ఉన్నప్పటికీ స్వచ్చందంగా పదవీ విరమణ తీసుకున్నాడు. ఒక రకంగా తెలంగాణ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఏ వ్యక్తినైతే కావాలని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో స్వల్ప కాలంలో నాడు నేడు కార్యక్రమంతో పేరు తీసుకు వచ్చేలా చేశాడు.
ఇవాళ వ్యవస్థ కుళ్లి పోయిందని, మద్యం, మత్తు మందులో యువత జోగుతోందని , కావాల్సింది విద్య, ఆరోగ్యం, ఉపాధి కావాలనే నినాదంతో ముందుకు వెళుతున్నారు ఆకునూరి మురళి(Akunuri Murali) . ఆయనకు సమాజం పట్ల ప్రత్యేకించి తెలంగాణ పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. అంతకంటే విజన్ కూడా ఉంది.
కావాల్సిందల్లా ఆయనతో కలిసి నడిచే వారు భాగం పంచుకోవడం. వివక్ష లేని ప్రజలందరికీ సమాన అవకాశాలు , సమాన ప్రాతినిధ్యం , భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటున్న ఆకునూరి మురళి ప్రయత్నం ఫలవంతం కావాలని కోరుకుందాం.
Also Read : ఆధార్ తో పాన్ కార్డు లింకు తప్పనిసరి