Amruta Fadnavis Comment : వివాదం ‘జాతిపిత’ రాద్ధాంతం

హ‌ద్దులు దాటుతున్న మాట‌లు

Amruta Fadnavis Comment : ఈ దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన మ‌హాత్మా గాంధీని జాతిపిత‌గా పిలుస్తున్నాం. ఆయ‌నను ప్ర‌పంచ వ్యాప్తంగా కొలుస్తోంది. ఆరాధిస్తోంది. మ‌హాత్ముడి జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకున్నా వాళ్లు కోట్ల‌ల్లో ఉన్నారు ప్ర‌పంచ వ్యాప్తంగా. దేశానికి స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్లు పూర్త‌యినా ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

గాంధీని పొట్టన పెట్టుకున్న నాథురామ్ గాడ్సే ను నిందిస్తున్న వాళ్లు లేక పోలేదు. ఈ త‌రుణంలో దేశంలో మ‌రోసారి జాతిపిత గురించిన చ‌ర్చ కొన‌సాగుతోంది. మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి అమృతా ఫ‌డ్న‌వీస్ (Amruta Fadnavis) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నిన్న‌టి త‌రానికి మ‌హాత్మా గాంధీ జాతిపిత అయితే నేటి న‌వ భార‌తావ‌నికి న‌రేంద్ర మోదీ జాతిపిత అని కితాబు ఇచ్చారు.

ఇందులో ఎలాంటి సందేహం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను అన్న కామెంట్స్ కు క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు అమృతా. తాజాగా జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ దేశాన్ని అమ్మ‌కానికి పెట్టిన మోదీ ఎలా దేశానికి తండ్రి అవుతారో చెప్పాలంటూ నిల‌దీశారు.

దీంతో మ‌రోసారి జాతిపిత వివాదం మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. హాట్ టాపిక్ గా మారింది. దేశ స్వాతంత్ర ఉద్య‌మంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, దాని అనుబంధ సంస్థలు పాల్గొన్న దాఖ‌లాలు లేవ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు నితీశ్ కుమార్. విప‌క్షాల‌న్నీ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాయి.

అమృతా ఫ‌డ్న‌వీస్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశాయి. న‌వ భార‌త జాతిపిత ఎలా అవుతారంటూ ప్ర‌శ్నించాయి. నిల‌దీశాయి. భార‌త దేశంలో ఇద్దరు మహాత్ములు ఉన్నారు.

వారిలో ఒక‌రు గాంధీ మ‌రొక‌రు మోదీ అంటూ కితాబు ఇచ్చారు అమృతా ఫ‌డ్న‌వీస్. కోట్లాది రూపాయ‌ల ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను గంప‌గుత్త‌గా వ్యాపారులు, కార్పొరేట్ల‌కు అప్ప‌నంగా అమ్ముతూ వ‌స్తున్న మోదీ ఎలా ఫాద‌ర్ ఆఫ్ నేష‌న్ అవుతారంటూ నిల‌దీస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మ‌రాఠా మాజీ మంత్రి య‌శోమ‌తి ఠాకూర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్దాంతాల‌ను అనుస‌రిస్తున్న వ్య‌క్తులు గాంధీజీని ప‌దే ప‌దే చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆయ‌న గురించిన చ‌రిత్ర లేకుండా చేయాల‌ని అనుకుంటున్నారు.

అందులో భాగంగానే అమృత ఇలా మాట్లాడిందంటూ మండిప‌డ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ గాడ్సే ఆరాధ‌కుల‌ని వాళ్ల‌కు గాంధీని గురించి మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు ఎంపీ ప్ర‌మోద్ తివారీ. ఇదంతా మోదీని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే అమృత అలా అన్న‌ద‌ని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ.

దేశంలో ప్ర‌ధాన స‌మ‌స్య‌లు పేరుకు పోయాయి. ఆక‌లి, పేద‌రికం, నిరుద్యోగం, ఉగ్ర‌వాదం, మ‌తం వాటి నుంచి ఫోక‌స్ పెట్ట‌కుండా ఉండేందుకు ఆమె అలా కామెంట్ చేసిందంటూ శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏది ఏమైనా మాట‌లు మంట‌లు రేపుతున్నాయి. వివాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. అవును నిజ‌మైన జాతిపిత ఎవ‌రు అనేది ప్ర‌జ‌లు నిర్ణ‌యించాల్సి ఉంది.

Unemployment Rate : భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

Leave A Reply

Your Email Id will not be published!