AP High Court : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఏర్పాటు పై ఆరాతీసిన కోర్టు
ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలనీ స్పష్టం చేసింది...
AP High Court : సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా అని హైకోర్టు(AP High Court) ప్రశ్నించింది. పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన కెమెరాలు స్టేషన్ ప్రాంగణం మొత్తం రికార్డయ్యేలా చేశారా లేదా అని కూడా విచారించింది.
AP High Court Comment
ఈ అంశంపై పరిశీలించి, రాష్ట్రస్థాయిలో ఐటీ విభాగం బాధ్యుడికి నివేదిక సమర్పించాలని డీఎస్పీలను ఆదేశించింది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలనీ స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు, వాటి నిర్వహణ, మరమ్మతులు, స్టోరేజ్ సామర్థ్యం వంటి వివరాలను అదనపు అఫిడవిట్ ద్వారా ప్రభుత్వం సమర్పించాలని పేర్కొంది. రాష్ట్రంలో 1,392 పోలీసు స్టేషన్లలో 1,001 స్టేషన్లలో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసింది. మిగిలిన స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటు చేయకపోవడానికి కారణాలను కూడా చెప్పాలని కోరింది.
మరియు 81 జైళ్లలో 1,226 కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, 785 మాత్రమే పనిచేస్తున్నాయని, మిగిలిన కెమెరాల మరమ్మతులు చేపట్టడంపై సమాధానాలు కోరింది. ప్రస్తుతం ఉన్న కెమెరాల వ్యవస్థ ద్వారా ఎంతకాలం పాటు ఫుటేజ్ నిల్వ చేయగలుగుతారో వివరించాలని, అలాగే కెమెరాలు మరమ్మతు చేయడానికి తీసుకున్న చర్యలను కూడా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది.
హైకోర్టు(AP High Court) 2019లో పిటిషనర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించిన విషయం గుర్తుచేసింది. ఈ మేరకు సోమవారం విచారణలో జస్టిస్ ఆర్. రఘునందనరావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పిటిషనర్ తరపున న్యాయవాది తాండవ యోగేశ్ వాదిస్తూ, ఇంకా 391 పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, వాటి నిర్వహణపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరారు. ప్రభుత్వం తరపున న్యాయవాది టి. విష్ణుతేజ వాదిస్తూ, లాకప్ ఉన్న స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది, మరియు మరమ్మతులు చేసే బాధ్యతను రెండు ఏజెన్సీలకు అప్పగించామని వివరించారు.
Also Read : కొత్త కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ‘జ్ఞానేష్ కుమార్’