Arvind kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పంజాబ లో జరిగిన ఎన్నికల్లో ఆప్ ఘన విజయంతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా త్వరలో జరగబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు.
మొన్నటికి మొన్న గుజరాత్ లో పర్యటించిన ఆప్ చీఫ్ ఇవాళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్రానికి సంబంధించిన తన మిషన్ ను ఈ సందర్భంగా ప్రజల ముందు ఉంచారు.
అంతకు ముందు ఆప్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ షో చేపట్టారు. ఢిల్లీ మోడల్ ను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. తాము విద్య, వైద్యం, ఉపాధి పై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్ లో కొలువు తీరిన ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సమస్యలను గాలికి వదిలి వేసిందంటూ ఆరోపించారు. తమకు ఛాన్స్ ఇస్తే అద్భుతమైన ప్రజా పాలనను అందజేస్తామని చెప్పారు అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal).
ఇక్కడి ప్రజలు పాత రాజకీయాలను చూసి విసిగి పోయారని చెప్పారు. తాము పవర్ లోకి వస్తే అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పాలన అందజేస్తామని తెలిపారు. తమకు రాజకీయాలు చేయడం రాదన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రజలు మార్పు కోరుకున్నారని హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కూడా ఆ మార్పు రావాలని డిసైడ్ అయ్యారని పేర్కొ్న్నారు సీఎం.
Also Read : భారత్ లో గోధుమలకు ఢోకా లేదు