Arvind Kejriwal Comment : ఢిల్లీ సీఎం దారెటు..?
అవినీతి చట్రంలో కేజ్రీవాల్
Arvind Kejriwal Comment : భారత దేశ రాజకీయాలలో చెరపలేని అధ్యాయం ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుడే నా ఆయుధం అవినీతిపై యుద్దం అంటూ ప్రకటించి అద్భుత విజయాన్ని సాధించిన ఘనత ఆయనది.
నిన్నటి దాకా కేజ్రీవాల్ వేరు ఇవాళ వినిపిస్తున్న కహానీ వేరు. ప్రస్తుతం భ్రష్టు పట్టి పోయిన పొలిటికల్ సిస్టమ్ లో భూతద్దం పెట్టి వెతికినా నిజాయితీ పరులైన నాయకులు దొరకడం లేదు. ఒకనాడు రైలు ప్రమాదం జరిగితే తన పదవికి రాజీనామా చేసిన ఘనత లాల్ బహదూర్ శాస్త్రిది.
కానీ ఇవాళ కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా చేతులు తడపందే పని కాని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే విద్య , వైద్యం , ఉపాధి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ప్రధాన ఎజెండాతో ముందుకు వచ్చారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal Comment).
దేశ రాజధాని ఢిల్లీ కోటపై సామాన్యుడి జెండాను ఎగుర వేసిన చరిత్ర కూడా ఆయనదే. సుదీర్ఘ కాలం పాటు పాలిస్తూ వచ్చిన ప్రధాన పార్టీలకు పంజాబ్ లో కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చిన ఘనత కూడా అరవింద్ కేజ్రీవాల్ దే. దానిని కాదనలేం.
ఇప్పటి దాకా తన జీవితం తెరిచిన పుస్తకం అంటూ ప్రకటిస్తూ వచ్చారు ఆప్ చీఫ్. అందుకు అనుగుణంగా ఉండేలా తనను తాను మల్చుకుంటూ ..మార్పులు చేసుకుంటూ వచ్చారు. దేశ రాజధానిలో అత్యాధునిక రీతిలో తీర్చిదిద్దిన బడులు, మొహల్లా క్లినిక్ లు దేశ వ్యాప్తంగా పేరు పొందాయి. దానినే ఆయన పాలనా పనితీరుకు గీటురాయిగా పేర్కొంటూ వచ్చారు.
వీటినే ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ మధ్యన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని కూడా ప్రస్తావించారు. వరుసగా ఢిల్లీకి సీఎం కావడం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలు వచ్చినా తట్టుకుని నిలబడింది ఆప్. మేయర్ పీఠం కూడా దక్కించుకుంది.
దీని వెనుక కేజ్రీవాల్ వ్యూహం దాగి ఉంది. విచిత్రం ఏమిటంటే ఆయన తన వద్ద ఏ శాఖను కూడా ఉంచుకోలేదు. ఇక ఆప్ కు కర్త..కర్మ..క్రియ అన్నీ ఆయనే. కేజ్రీవాల్ ఐఐటీ ఖరగ్ పూర్ లో చదివారు. టాటా స్టీల్ లో కొలువు పొందాడు. 1993లో సివిల్స్ పాసయ్యాడు.
ఐఆర్ఎస్ కు ఎంపికయ్యాడు కేజ్రీవాల్. ఐఆర్ఎస్ అధికారి అయిన సునీతను 1995లో పెళ్లి చేసుకున్నాడు. 1999లో పరివర్తన్ అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 2006లో ఐటీలో ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ పదవికి రాజీనామా చేశాడు.
అవినీతికి వ్యతిరేకంగా యుద్దం చేశాడు. జన్ లోక్ పాల్ బిల్లుపై ఉద్యమించాడు. సమాచార హక్కు చట్టం కోసం 2006లో కేజ్రీవాల్ కు రామన్ మెగసెసే పురస్కారం దక్కింది. 2012లో ఆప్ ను ఏర్పాటు చేశాడు. అన్నా హజారే, ప్రశాంత్ భూషణ్ ,యోగేంద్ర యాదవ్ , కిరణ్ బేడి లాంటి వాళ్లంతా కేజ్రీవాల్(Arvind Kejriwal) ను వదిలేశారు. పలు పురస్కారాలు, అవార్డులు అందుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది. ఏ అవినీతిపై యుద్దం చేశాడో అదే కరప్షన్ ఆరోపణల్లో చిక్కుకోవడం విచిత్రం కాక మరేమిటి. కంట్లో నలుసుగా మారిన కేజ్రీవాల్ ను కటకటాల్లోకి నెట్టాలనేది బీజేపీ ప్లాన్. ఇప్పటికే ఈడీ స్కెచ్ వేసింది..కవితతో పాటు సీఎం కూడా అరెస్ట్ అవుతారా అనేది వేచి చూడాలి.
ఏది ఏమైనా రాజకీయం చేయాలని అనుకోవడంలో తప్పు లేదు..కానీ ఎలాగైనా పవర్ లోకి రావాలని అనుకోవడం మాత్రం చెడి పోయేలా చేస్తుందన్నది వాస్తవం. ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుడు ఏమీ కాదు అరవింద్ కేజ్రీవాల్. రాజీ పడతారా లేక అవినీతి మకిలం నుంచి తనను తాను క్లీన్ చిట్ తో బయట పడతారా అనేది వేచి చూడాలి.
Also Read : ఆధునిక ప్రహ్లాదుడు సిసోడియా