Basara IIIT : బాసర ట్రిపుల్-ఐటీలో మరో విద్యార్థిని ‘స్వాతిప్రియా(17)’ ఆత్మహత్య
కొన ఊపిరితో ఉన్న స్వాతిని వెనువెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే....
Basara IIIT : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్-ఐటీలో మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఉజ్వల-రవీందర్‌ల కుమార్తె స్వాతిప్రియ(17) బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్-ఐటీ(Basara IIIT)లో పీయూసీ రెండో సంవత్సరం చుదువుతోంది. సోమవారం ఉదయం తోటి విద్యార్థులు అల్పాహారానికి మెస్‌లకు వెళ్లగా.. గదిలో ఒంటరిగా ఉన్న స్వాతిప్రియ(Swathi Priya).. ఫ్యాన్‌కు ఉరివేసుకుని, ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు స్వాతి తన తోటి విద్యార్థినికి మెసేజ్ చేసింది. దాంతో.. కంగారుపడ్డ ఆ విద్యార్థిని వచ్చేలోగా.. స్వాతి ఫ్యానుకు వేళాడుతూ కనిపించింది.
కొన ఊపిరితో ఉన్న స్వాతిని వెనువెంటనే ఆస్పత్రికి తరలించి ఉంటే.. ప్రాణాలను కాపాడేవారిమని తోటి విద్యార్థినులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో ఆరు పేజీల సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది. స్వాతిప్రియ(Swathi Priya) కుటుంబ సభ్యులు మాత్రం.. సీనియర్ ఇంజనీరింగ్ విద్యార్థి వేధిస్తున్నాడని తమ కూతురు ఫిర్యాదు చేసినా.. వర్సిటీ అధికారులు పట్టించుకోలేదని స్వాతిప్రియతల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. గత నెల 4న, ఈనెల 3న అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదని వాపోయారు. స్వాతి తన స్నేహితురాలి ప్రేమ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే సీనియర్ విద్యార్థి వేధింపులు మొదలైనటుల తెలుస్తోంది. విద్యార్థిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్ ముట్టడికి యత్నించారు.
దీంతో..పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. వర్సిటీ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో ఏబీవీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కార్యకర్తకు తీవ్ర గాయమవ్వగా.. పోలీసులు అతణ్ని ఆస్పత్రికి తరలించారు. సెక్యూరిటీ సిబ్బంది దాడిలో.. మరికొందరు కార్యకర్తలు గాయాలపాలయ్యారు. స్వాతిప్రియమృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూడగానే.. సొమ్మసిల్లి పడిపోయారు. ‘‘అక్కయ్యా.. ఎంత పని జరిగింది’’ అంటూ స్వాతిప్రియసోదరుడు ఓంసాయి ఆమె కాళ్లపై పడి వెక్కివెక్కి ఏడవడం అక్కడి వారిని కలిచివేసింది.
స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని కుటుంబ సభ్యులు మీడియాకు చెప్పారు. తాము వచ్చేలోపే మృతదేహాన్ని భైంసా ఆస్పత్రికి తరలించడంలో ఆంతర్యమేంటని నిలదీశారు. ఓ దశలో పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ కుమార్తె మృతిపట్ల అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు చేపట్టి.. వాటిని నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భైంసా టౌన్ సీఐ గోపీనాథ్ కలుగజేసుకుని, వారికి సర్దిచెప్పడంతో శాంతించారు.
ట్రిపుల్ ఐటీ(Basara IIIT)లో వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగిలిస్తోంది. యూనివర్సిటీ లోపాలు విద్యార్థులకు శాపాలుగా మారి.. వారి ప్రాణాలను హరిస్తున్నాయి. అనేక సమస్యల మధ్య విద్యార్థులు చదువు సాగించలేక ఒత్తిడికి గురై అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ఇక్కడ 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 8 మంది మైనర్లు.
Basara IIIT – విద్యార్థుల ఆత్మహత్యల చిట్టా
తేదీవిద్యార్థి పేరు
23.08.2022 రాథోడ్ సురేశ్
22.12.2022 భానుప్రసాద్
14.06.2023 వడ్ల దీపిక
15.06.2023 బుర్ర లిఖిత
07.08.2023 జాదవ్ బబ్లూ
26.11.2023 ప్రవీణ్ కుమార్
22.02.2024 శిరీష
15.04.2024 అరవింద్
11.11.2024 స్వాతిప్రియ
Also Read : Kakani Govardhan : ఎమ్మెల్యే సోమిరెడ్డి పై అసత్య ఆరోపణలు కేసులో విచారణకు మాజీ మంత్రి