MS Dhoni : భారత స్టార్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ గా ఉన్న ఝార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఉన్నట్టుండి తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
ఈ విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఆయన అనూహ్య నిర్ణయం వెనుక ఏమై ఉంటుందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఈనెల 26న ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ ఈనెల 26 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ సీఎస్కే ఆడనుంది. ఈ తరుణంలో ఉన్నట్టుండి ధోనీ తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించడం అటు క్రీడా వర్గాలతో పాటు సీఎస్కే అభిమానుల్లో కలకలం రేపింది.
ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆల్ రౌండర్ గా పేరొందిన స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజాను నియమిస్తున్నట్లు సీఎస్కే ఫ్రాంచైజీ ప్రకటించింది.
కాగా ధోనీ కెప్టెన్ గా రిజైన్ చేసినప్పటికీ సాధారణ ఆటగాడిగా ఇక నుంచి జట్టులో కొనసాగుతాడని స్పష్టం చేసింది. సీఎస్కే స్కిప్పర్ గా ధోనీ (MS Dhoni)జట్టును విజయ పథంలో నడిపించాడు.
2010, 2011, 2018, 2021లో జరిగిన ఐపీఎల్ టోర్నీలలో సత్తా చాటింది. టైటిళ్లు గెలుపొందింది. ప్రస్తుతం ధోనీ తప్పు కోవడంతో రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో నాయకుడిగా కొనసాగనున్నాడు.
రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగించడం వెనుక ధోనీ పాత్ర ఉందనేది వాస్తవం. మొత్తంగా టోర్నీకి ముందు ఈ నిర్ణయం ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చర్చ జరుగుతోంది.
ధోనీకి మిస్టర్ కూల్ అన్న పేరుంది. ఇప్పటికీ ఈ వార్త నిజం కాదని, నమ్మలేం అంటున్నామని ఫ్యాన్స్ వాపోతున్నారు.
Also Read : సఫారీ గడ్డపై బంగ్లా భళా