Big Snake Vasuki: గుజరాత్ లో లభ్యమైన ప్రపంచంలో అతి పెద్ద సర్పం వాసుకి శిలాజాలు !
గుజరాత్ లో లభ్యమైన ప్రపంచంలో అతి పెద్ద సర్పం వాసుకి శిలాజాలు !
Big Snake Vasuki: ఈ భూ ప్రపంచంలో అతిపెద్ద సర్పం ఏదంటే… ఎవరైనా సింపుల్ గా అనకొండ అని చెప్తారు. ఇటీవల కాలంలో అనకొండపై వచ్చిన సినిమాల ప్రభావంతో ప్రపంచంలోనే అతి పెద్ద సర్పంగా అనకొండ గుర్తింపు పొందింది. కానీ వాటికన్నా అతి పెద్ద సర్పం మన దేశంలో తిరుగాడిందని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. గుజరాత్(Gujarat) లోని ఓ గనిలో దానికి సంబంధించిన శిలాజాలను గుర్తించారు. 50 అడుగులకుపైగా పొడవుతో… ఏకంగా టన్నుకుపైగా బరువుతో ఉంటుందని అంచనా వేసిన ఈ సర్పానికి ‘వాసుకి’ అని పేరు పెట్టారు. హిందూ పురాణాల ప్రకారం దేవదేవుడైన శివుడి మెడలో ఉండే సర్పమే వాసుకి.
Big Snake Vasuki – ముందు మొసలి అనుకున్నారు కానీ… తాజాగా సర్పం అని తేలింది
2005లో గుజరాత్(Gujarat)లోని ఓ బొగ్గు గనిలో తవ్వకాలు జరుపుతుండగా కొన్ని శిలాజాలను గుర్తించారు. వాటిని సేకరించిన శాస్త్రవేత్తలు పురాతన కాలం నాటి భారీ మొసలి వంటి జీవి వెన్నుపూసలు కావొచ్చని ప్రాథమికంగా భావించారు. తర్వాత ఈ విషయం మరుగున పడింది. తిరిగి కొన్నేళ్ల క్రితం వీటిపై రూర్కీ ఐఐటీ(IIT) శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. గనిలో లభించిన మొత్తం 27 వెన్నుపూసలను క్రమ పద్ధతిలో చేర్చారు. వాటిలో కొన్ని ఒకదానికొకటి అనుసంధానమై ఉండటాన్ని గమనించారు. వివిధ జీవుల వెన్నుపూసలతో ఈ శిలాజ ఎముకలను పోల్చి చూశారు.
దీనితో ఈ వెన్నుపూసల శిలాజాలు ఓ భారీ సర్పానికి సంబంధించినవి కావొచ్చని గత ఏడాదే ఓ అంచనాకు వచ్చారు. పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి… తాజాగా ఇది భారీ సర్పమేనని నిర్ధారించారు. ఆ వెన్నుపూసల సైజు, స్థితిగతులు, దొరికిన ప్రాంతం, ఇతర ఆధారాలను బట్టి… సర్పం పరిమాణం, అది జీవించిన తీరు, దాని ఆహారమేమిటన్న అంచనాలు వేశారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సర్పమని తేల్చారు. దానికి శివుడి మెడలో ఉండే సర్పం పేరిట ‘వాసుకి ఇండికస్’ అని పేరు పెట్టారు.
4.7 కోట్ల ఏళ్ల కిందటి సర్పమే ఈ వాసుకి…
వాసుకి 50 అడుగులు (15 మీటర్లు) పొడవుతో… టన్నుకుపైగా బరువుతో ఉంటుందని అంచనా వేశారు. సుమారు 4.7 కోట్ల ఏళ్ల కింద ఈ సర్పం జీవించిందని తేల్చారు. దీని భారీతనం కారణంగా మెల్లగా కదిలేదని, దానికి చిక్కిన జంతువులను గట్టిగా చుట్టేసి తినేసేదని గుర్తించారు. ప్రస్తుతం భూమ్మీద జీవించి ఉన్న వాటిలో అనకొండలు, పైథాన్ లు అతి పెద్దవి. అంతరించిపోయిన వాటిలో కొలంబియాలో గుర్తించిన టిటనోబోవా అతి పెద్దది. దాని ఎముకల శిలాజాలను బట్టి… 42.7 అడుగుల (13 మీటర్లు) పొడవుతో, 1,100 కిలోలకు పైగా బరువుతో ఉండి ఉంటుందని అంచనా వేశారు. చేపలు, తాబేళ్లు, మొసళ్లు, వేల్స్ ను తినేదని అంచనా వేశారు.
‘‘ఆ కాలం నాటి వాతావరణం, అందుబాటులో ఉన్న ఆహారం, శత్రు జీవులు లేకపోవడం, నాటి వేడి వాతావరణం వల్ల వాసుకి సర్పం ఇంత భారీగా ఎదిగి ఉంటుందని భావిస్తున్నాం. ఇది అనకొండ తరహాలోనే నీటిలో కంటే నేల మీదే జీవించి ఉండటానికి అవకాశం ఎక్కువ. భారీగా ఉండటం వల్ల చెట్లపైకి ఎక్కగలిగి ఉండేది కాదు. ఇది కచ్చితంగా టిటనోబోవా కంటే పెద్దది. భూమ్మీద జీవించిన సర్పాలన్నింటికంటే పెద్దదని చెప్పవచ్చు’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన రూర్కీ ఐఐటీ శాస్త్రవేత్తలు దేవజిత్ దత్తా, సునీల్ వాజ్పాయ్ తెలిపారు.
Also Read : Doordarshan: కాషాయ రంగులోనికి డీడీ న్యూస్ లోగో ! మండిపడుతున్న విపక్షాలు !