Doordarshan: కాషాయ రంగులోనికి డీడీ న్యూస్‌ లోగో ! మండిపడుతున్న విపక్షాలు !

కాషాయ రంగులోనికి డీడీ న్యూస్‌ లోగో ! మండిపడుతున్న విపక్షాలు !

Doordarshan: ప్రభుత్వ ప్రసార సంస్థ ‘దూరదర్శన్‌’ సార్వత్రిక ఎన్నికల వేళ వివాదంలో చిక్కుకుంది. దూరదర్శన్ లో వార్తా మాధ్యమం అయిన ‘డీడీ న్యూస్‌’ లోగో రంగును మార్చడమే ఇందుకు కారణం. గతంలో ఈ లోగో ఎరుపు రంగులో ఉండగా… ఇటీవల దాన్ని కాషాయ రంగులోకి మార్చారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది. ‘‘మా విలువలు అలాగే ఉన్నాయి. కానీ, ఇక నుంచి మేం కొత్త అవతార్‌ లో అందుబాటులో ఉంటాం. కొత్త ప్రయాణానికి సిద్ధంకండి’’ అని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది.

Doordarshan Logo Isuue

దీనితో డీడీ(Doordarshan) న్యూస్ లోగోను బీజేపీ జెండా రంగు అయిన కాషాయంలోకి మార్చడంపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ‘‘స్వయం ప్రతిపత్తి ఉన్న ప్రభుత్వ సంస్థల కాషాయీకరణ, వాటిపై నియంత్రణ సాధించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివర్ణిస్తున్నాయి. జాతీయ ప్రసార సంస్థ విశ్వసనీయతను, నిష్పాక్షికతను దెబ్బతీసే ప్రయత్నం కూడా’’ అని కాంగ్రెస్‌ నేత, మాజీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీశ్‌ తివారీ విమర్శించారు.

దూరదర్శన్‌ మాతృ సంస్థ ప్రసారభారతి (డీడీ, ఆల్‌ ఇండియా రేడియో) మాజీ సీఈవో జవహర్‌ సర్కార్‌ కూడా ఈ మార్పును తప్పుబట్టారు. ‘‘దూరదర్శన్‌ తన న్యూస్‌ లోగోను కాషాయంలోకి మార్చింది. ఈ నిర్ణయంతో ఇది ఇక ‘ప్రసార భారతి’ కాదు. ‘ప్రచార భారతి’ అనే భావన కలుగుతోంది. జాతీయ ప్రసార సంస్థ కాషాయీకరణను చూస్తున్నాను’’ అని విమర్శించారు. ప్రసార భారతి ప్రస్తుత సీఈవో గౌరవ్‌ ద్వివేది లోగో మార్పును సమర్థించుకున్నారు. దృశ్య సౌందర్యాన్ని మరింత పెంచేందుకే రంగును మార్చామని, దీనిపై విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

Also Read : Cherlapally Central Jail: చర్లపల్లి జైలు ఖైదీ కడుపులో తొమ్మిది మేకులు !

Leave A Reply

Your Email Id will not be published!