Bilkis For Justice Comment : స‌మాజం నిశ్శ‌బ్దం ప్ర‌మాదం

దేశంలో న్యాయం ఎండ‌మావేనా

Bilkis For Justice Comment : మానవ స‌మూహం అంటేనే ఆలోచ‌నల స‌మాహారం. కానీ రోజు రోజుకు టెక్నాల‌జీ దెబ్బ‌కు ఆలోచించ‌డం మానేశాయి. మార్కెట్ మాయాజాలం మ‌నుషుల్ని క‌ట్టి ప‌డేస్తోంది.

జీవితాల‌ను నియంత్రిస్తోంది. త‌మ క‌లల్ని కూడా క‌ట్టి ప‌డేస్తోంది. ఇది ఎంత‌లా చొచ్చుకు పోయిందంటే ప్ర‌తి క‌ద‌లిక‌ల్ని, ప్ర‌తి సంద‌ర్భాన్ని ప్ర‌శ్నించ నీయ‌కుండా, నిల‌దీయ‌కుండా చేస్తోంది.

వ్యాపారం, వాణిజ్యం దేశ సంస్కృతిలో భాగ‌మైన‌ప్పుడు దానిని ఎవ‌రూ నియంత్రించ‌లేరు. ఇప్పుడు 75 ఏళ్ల స్వ‌తంత్ర వ‌జ్రోత్స‌వాలు ఘ‌నంగా జ‌రుపుకుంటున్న త‌రుణంలో సామూహిక అత్య‌చారానికి గురై , త‌న వారిని కోల్పోయిన ఓ బాధితురాలి కేసులో దోషుల‌ను నిస్సిగ్గుగా వ‌దిలి వేయ‌డం ఎన్నో ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతోంది.

మ‌రెన్నో అనుమానాల‌ను వ్య‌క్తం చేసేలా చేస్తోంది. ప్ర‌శ్నించ‌డం అన్న‌ది లేక పోతే అది ప్ర‌జాస్వామ్యం కానే కాదు. స‌మున్న‌త భార‌త దేశం ఎటు పోతోంది.

అధికారంలో ఉన్నంత మాత్రాన దోషులు ఎలా కొద్ది కాలంలో నిర్దోషులుగా మారుతారో విడుద‌ల చేసిన భార‌తీయ జ‌న‌తా పార్టీ కొలువు తీరిన గుజ‌రాత్ ప్ర‌భుత్వ‌మే చెప్పాలి.

ఇవాళ బిల్కిస్ బానోకు జ‌రిగి ఉండ‌వ‌చ్చు. కానీ రేపు మ‌న‌కు జ‌ర‌గ‌ద‌ని గ్యారెంటీ ఏంటి. ఇవాళ ఎవ‌రికి భ‌ద్ర‌త ఉంద‌ని అనుకుంటున్నారు.

మ‌తం, రాజ‌కీయం, మాఫియా , వ్యాపారం, వాణిజ్యం, కార్పొరేట్ ప్ర‌పంచం ఒక్క‌టై పోయిన స‌మ‌యంలో న్యాయం దొరుకుతంద‌ని ఆశించ‌డం పొర‌పాటే.

భ‌రోసా ఇవ్వాల్సిన ప్ర‌భుత్వ‌మే నిస్సిగ్గుగా స‌మ‌ర్థించుకుంటే , ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన న్యాయ వ్య‌వ‌స్థ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుంటే ఇంకేం భ‌రోసా ద‌క్కుతుంద‌ని అనుకోగ‌లం.

దేశ చ‌రిత్ర‌లో యావ‌జ్జీవ కార‌గార శిక్ష‌కు గురైన వాళ్లు చివ‌ర‌కు క్లీన్ చిట్ (ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింద‌న్న కార‌ణం )తో స్వేచ్ఛ క‌ల్పించ‌డం దారుణం. హృద‌య విదార‌కం కూడా.

బిల్కిస్ బానోకు జ‌రిగిన అన్యాయం గురించి దేశం యావ‌త్తు స్పందించింది. ప్ర‌ధానంగా యువ‌త నిల‌దీయడం మాత్రం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి.

ఎంతో మంది నేర‌స్తులు జైళ్ల‌ల్లో మ‌గ్గుతున్నారు. మ‌రి వారెందుకు విడుద‌ల కాలేక పోయారు. సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, దారుణ హ‌త్య‌కు పాల్ప‌డిన వారు ఎలా బ‌య‌ట‌కు వ‌స్తారో దేశాన్ని ఏలుతున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పాలి(Bilkis For Justice).

దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఇత‌ర ప్రాంతాల‌లో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు మిన్నంటాయి. జ‌స్టిస్ ఫ‌ర్ బిల్కిస్ అంటూ నినాదాలు హోరెత్తాయి.

ఇందులో న‌టీన‌టులు, సామాజిక కార్య‌క‌ర్త‌లు, హ‌క్కుల సంస్థ‌లు , మేధావులు, బుద్ది జీవులు, విద్యార్థులు సంఘీభావంగా పాల్గొన‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా న‌టి ష‌బానా ఆజ్మీ చేసిన కామెంట్స్ ను ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాలి. ఇంత దారుణం జ‌రుగుతున్నా స‌భ్య స‌మాజం ఎందుక‌ని నిశ్శ‌బ్దంగా ఉంద‌ని..?.

దీనికి ఎవ‌రు స‌మాధానం చెప్పాలి. దేశ‌మా..133 కోట్ల మంది ప్ర‌జ‌లా లేక మోదీనా(PM Modi).

Also Read : బిల్కిస్ దోషుల విడుద‌ల సిగ్గు చేటు

Leave A Reply

Your Email Id will not be published!