నటుడు టైగర్ ష్రాఫ్‌పై బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు

తృటిలో త‌ప్పించుకున్న బాలీవుడ్ యాక్ట‌ర్

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై న‌గ‌రంలో కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నటుడు తృటిలో సురక్షితంగా బయటపడ్డారు. అయితే అతని కారు డ్రైవర్, మరో స్థానిక పౌరుడు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన‌ ప్రాథమిక సమాచారం ప్రకారం టైగర్ ష్రాఫ్ తన కారులో ప్రయాణిస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారిని వెంబడించారు. ఇది గమనించిన వారు నటుడిపై , అతని డ్రైవర్‌పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్, అటుగా వెళ్తున్న మరో సాధారణ పౌరుడు గాయపడటంతో, స్థానికులు వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ సురక్షితంగా ఉన్నారని, ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

ఈ కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే, ‘లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్’ అనే నేర ముఠా దీనికి తామే బాధ్యులమని ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఈ ముఠా బాలీవుడ్ ప్రముఖులను బెదిరింపులతో లక్ష్యంగా చేసుకున్న చరిత్ర ఉన్నందున.. ఈ తాజా దాడి బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. సమాచారం అందుకున్న వెంటనే ముంబై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేశారు. వారు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని, కాల్పులు జరిపి పారిపోయిన ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న స్పష్టమైన కారణాలు, ఇతర పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర దర్యాప్తు ద్వారా వెల్లడి కానున్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!