Charles Phillip Brown: తెలుగు భాషోద్ధారకుడు

తెలుగు సాహిత్యమునకు విశేష సేవలు అందించిన ఆంగ్లేయుడు.

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి పి బ్రౌన్)

Charles Phillip Brown : చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (నవంబర్ 10, 1798 – డిసెంబర్ 12, 1884): తెలుగు సాహిత్యమునకు విశేష సేవ ఆంగ్లేయుడు సి పీ బ్రౌన్. 1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్(Charles Phillip Brown). దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడిగా బ్రౌన్ గుర్తింపుపొందారు. తొలి తెలుగు శబ్దకోశమును పరిష్కరించి ప్రచురించిన బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. అంతేకాదు ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా బ్రౌన్ ను పరిగణిస్తారు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు.

Charles Phillip Brown – సిపి బ్రౌన్ తెలుగు అభ్యాసం

1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించిన సి. పి. బ్రౌన్(Charles Phillip Brown) తండ్రి మరణానంతరం కుటుంబంతో సహా ఇంగ్లండు వెళ్ళిపోయారు. క్రైస్తవ విధ్వాంసుడిగా తండ్రి నింపిన స్ఫూర్తితో సీపీ బ్రౌన్ గ్రీక్, లాటిన్, పారశీ, సంస్కృత భాషల్లో ఆరితేరాడు. అంతేకాదు బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగస్టు 4 న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది.

అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. తెలుగు భాష నేర్చుకోవడంలోని ఈ ఇబ్బందిని గ్రహించిన బ్రౌనును దాని పరిష్కారానికై పరిశోధన ప్రారంభించారు. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పాటు చేసే విధంగా కృషి చేసారు. వేమన, సుమతి శతకాలతోపాటుగా పల్నాటి యుద్ధం లాంటి చారిత్రక కావ్యాలను, నన్నయ్య, తిక్కన, గౌరన, శ్రీనాథుడు, పోతన, పెద్దన, రామరాజ భూషణుల కృతుల పరిష్కరణ – ప్రచురణలను ముద్రింపచేసాడు. వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశాడు.

Charles Phillip Brown- తెలుగు సాహితీసేవకు ఫలితంగా అప్పుల పాలైన సిపి బ్రౌన్

కడపలోను, మచిలీపట్నంలోను పాఠశాలలు పెట్టి విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేయడం… నెలనెలా పండితులకిచ్చే జీతాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడి అప్పుల పాలయ్యాడు. అదే సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయన్ను 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు.

1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. 1827 లో బ్రౌన్(Brown) ‘ఆంధ్ర గీర్వాణ ఛందము’ అనే పుస్తకం రాసినప్పటికీ, ఆయనకి మంచి గుర్తింపు తెచ్చిన పుస్తకం మాత్రం 1829 నాటి ‘వేమన శతకం’. అప్పటికి బ్రౌన్ అయిదేళ్లుగా వేమన సాహిత్యాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇందులో దాదాపు ఏడొందల పద్యాలకి ఆంగ్లానువాదాలతోపాటు విస్తృతమయిన పదకోశం కూడా సమకూర్చారు. మరో పదేళ్ల తర్వాత, 1164 పద్యాల మేరకి విస్తరింపచేసి, తిరిగి ‘వేమన శతకం’ అచ్చువేశారు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు.

తెలుగు భాషకు సిపి బ్రౌన్ చేసిన సేవ

వేమన పద్యాలను వెలికితీసిన సిపి బ్రౌన్ 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు. 1841లో “నలచరిత్ర”ను ప్రచురించాడు. “ఆంధ్రమహాభారతము”, “శ్రీమద్భాగవతము” లను ప్రచురించాడు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు. లండన్‌లోని “ఇండియా హౌస్ లైబ్రరీ”లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
“హరిశ్చంద్రుని కష్టాలు” గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు. 1844లో “వసుచరిత్ర”‘, 1851లో “మనుచరిత్ర” ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు. 1852లో “పలనాటి వీరచరిత్ర” ప్రచురించాడు.

Also Read : Yaddanapudi Sulochana Rani: నవలా రాజ్యంలో రాణి

 

Leave A Reply

Your Email Id will not be published!