CJI Manipur Parade Comment : ఈ దారుణాలకు ముగింపేది..?
సీజేఐ చంద్రచూడ్ ఆవేదన
CJI Manipur Parade Comment : కొలువు తీరిన ప్రభుత్వాలు నిస్తేజంగా మారిపోతే ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది. ఇన్ని ఘోరాలు, దారుణాలు, హత్యలు కొనసాగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు. ఇదేనా మానవత్వం. ఎక్కడుంది జవాబుదారీతనం. ఇలాగే వ్యవహరిస్తూ పోతే చివరకు ఎవరూ మిగలరు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ లేకుండా పోతే ఇంక వుండీ ఏం లాభం..? ఎవరి కోసం ప్రభుత్వం పని చేస్తోంది. దేని కోసం కొలువు తీరిందో తెలియకుండా పాలన సాగిస్తుంటే ఏమనుకోవాలి. ఇలాగేనా ప్రవర్తించేది..ఇలాగేనా వ్యవహరించేది. అమానవీయ సంఘటనలు ప్రతి రోజూ కొనసాగుతూ ఉంటే మీకు నిద్ర ఎలా పడుతోంది.
అంటే చూసీ చూడనట్లు ఉంటే నడిచి పోతుందని భావిస్తున్నారా. మీ వ్యక్తిగతమైన రాజకీయాలకు సామాన్య ప్రజలను, అమాయకులను బలిచేస్తూ పోతారా. అసలు మనం 21వ శతాబ్ధంలో ఉన్నామా లేక ఆదిమ ప్రపంచంలో కొనసాగుతున్నామా. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే. రాజ్యాంగం సాక్షిగా చేసిన ప్రమాణాలు ఏమై పోయాయి. ఎందుకు ఇంకా ఆ పదవుల్లో కొనసాగుతున్నారు. ఎవరిని కాపాడేందుకు ఇంకా మౌనం వహిస్తున్నారు. కేవలం ఒక వర్గం వారే ఎందుకు టార్గెట్ అవుతున్నారు. అలా కాక పోతే ఇలాంటి ఘోరాలు, అఘాయిత్యాలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి.
CJI Manipur Parade Comments
ఒక్కసారైనా మనుషులుగా ఆలోచిస్తున్నారా. లేక మాకెందుకు లే అని నిమ్మకుండి పోయారా. కనీస బాధ్యత లేకుండా పోతే చివరకు సర్వోన్నత న్యాయ స్థానం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఎందుకు కల్పించాలని అనుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో చేసిన ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు..సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI Manipur Parade Comment) .ఆయన ఆవేదన వ్యక్తం చేసింది..మధన పడింది మణిపూర్(Manipur) మండుతుండడంపై. ఒకానొక దశలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
మహిళలను ఓ వర్గం పనిగట్టుకుని రెండు కిలోమీటర్లకు పైగా నగ్నంగా ఊరేగించిన ఘటనపై సీజేఐ చేసిన వ్యాఖ్యలు పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆయన ప్రశ్నించింది, నిలదీసింది సభ్య సమాజాన్ని. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ ను. కొందరు సీజేఐని కోర్టు తన పరిమితుల్ని దాటిందంటూ వ్యాఖ్యానిస్తున్నా..ఎక్కడా వ్యక్తిగతంగా కించ పరిచేలా వ్యాఖ్యానించ లేదని గమనించాలి.
సోషల్ మీడియా వేదికగా ప్రసారమైన వీడియోను సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. ఈ మొత్తం ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వ్యక్తం చేసిన వ్యాఖ్యలు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. మణిపూర్(Manipur) దారుణంపై సీజేఐ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ నరసింహ, జస్టస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ దుర్వినియోగమే, మానవ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.
ఈ ఘటనకు పూర్తి బాధ్యత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. ఇది ఎంత మాత్రం ఆమోద యోగ్యం కానే కాదు. లింగ హింసను ప్రేరేపించేందుకు మత కలహాల ప్రాంతంలో మహిళలను సాధనంగా ఉపయోగించడం మంచి పద్దతి కాదు. ఇది ముమ్మాటికీ నేరమేనని కుండ బద్దలు కొట్టింది ధర్మాసనం. ఇలాంటి వాటి పట్ల మీడియా కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో స్పందించక పోతే తాము చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మొత్తంగా గుజరాత్ మోడల్ సరే దేశాన్ని మణిపూర్(Manipur) మోడల్ చేస్తారా అన్నది వేచి చూడాలి.
Also Read : Smriti Irani : స్కోర్ కార్డుపై స్మృతీ ఇరానీ ఫైర్