CM Mamata Banerjee: 25,753 మంది టీచర్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
25,753 మంది టీచర్ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు
CM Mamata Banerjee : పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో(Supreme Court) పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ) ద్వారా నియామకమైన 25,753 మంది టీచర్ల , బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. వీరి నియామక ప్రక్రియ యావత్తూ కళంక పూరితంగా, అక్రమాలతో కూడుకొని ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు పశ్చిమబెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్(డబ్ల్యూబీఎస్‌ఎస్‌సీ) ద్వారా నియామకమైన టీచర్లు, ఇతర సిబ్బందిని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna), జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. అంతేకాదు ఈ టీచర్ పోస్టుల నియామకాన్ని తాజాగా చేపట్టి 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
CM Mamata Banerjee Got Shock
ఈ సందర్భంగా… ‘‘నియామక ప్రక్రియలో విశ్వసనీయత, చట్టబద్ధత లోపించాయని పేర్కొంది. పరిష్కరించడానికి సాధ్యంకానంతగా ఈ ప్రక్రియ మొత్తం కలుషితమైపోయింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన కారణం ఏమీ తమకు కనిపించడం లేదని తెలిపింది. మోసపూరితంగా నియామకాలు పొందిన అభ్యర్థులు ఏళ్లతరబడి పొందిన జీతాలను వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, అయితే, వారి నియామకాలను రద్దు చేస్తున్నామని ధర్మాసనం తేల్చిచెప్పింది. భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డారు’’ అని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలను కొన్ని మార్పులతో యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు, సిబ్బంది ఇప్పటివరకూ తాము పొందిన జీతభత్యాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదంది. మానవీయ కారణాల రీత్యా కొందరు దివ్యాంగులకు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కోర్టు తన తాజా తీర్పు నుంచి మినహాయింపు ఇచ్చి వారు ఉద్యోగంలోనే ఉంటారని స్పష్టంచేసింది.
కోర్టు తీర్పుపై సీఎం మమతా స్పందన
ఈ తీర్పుపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee) స్పందిస్తూ… ఒక్క వ్యక్తి చేసిన తప్పిదానికి అందరినీ ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తనకు న్యాయవ్యవస్థపై ఎంతో గౌరవం ఉన్నా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును మానవత్వ కోణంలో అంగీకరించలేకపోతున్నాను అని పశ్చిమబెంగాల్ సీఎం మమత పేర్కొన్నారు. అయితే తీర్పునకు కట్టుబడతానని… కోర్టు ఆదేశాల మేరకు అమలుచేస్తానని స్పష్టంచేశారు. గురువారం కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ బెంగాల్ లో విద్యావ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం కోరుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. మోసపూరితంగా నియామకాలు పొందిన కొంతమంది వల్ల అభ్యర్థులందరినీ శిక్షించడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. ‘ఇటీవల ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినప్పుడు ఆయనను బదిలీతో సరిపుచ్చారు. మరి ఈ ఉపాధ్యాయులను ఎందుకు బదిలీతో సరిపుచ్చరు?’ అని ఆమె ప్రశ్నించారు. అయితే మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఈ పరిణామం టీఎంసీ ప్రభుత్వానికి షాక్ వంటిదని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే ?
టీచర్ల నియామక ప్రక్రియలో బెంగాల్(West Bengal) ప్రభుత్వం సృష్టించిన సూపర్‌న్యూమరరీ పోస్టులు ఈ వివాదానికి కేంద్రంగా మారాయి. 2016లో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షకు 23 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం ఖాళీలు 24,640 కాగా, 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీనితో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్‌న్యూమరిక్ పోస్టులు సృష్టించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ… కొంతమంది హై కోర్టును ఆశ్రయించారు. దీనితో కలకత్తా హై కోర్టు ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. అయితే హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ… మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగలడంతో… ఈ నియామకాలను రద్దు చేయాల్సిన పరిస్థితి బెంగాల్ ప్రభుత్వంకు ఏర్పడింది.
Also Read : MP Mithun Reddy: లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఎదురుదెబ్బ