CM MK Stalin : 2026 ఎన్నికల్లో 200 సీట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే కసరత్తు
ఈ సమావేశంలో మూడు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు.
CM MK Stalin : లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో విజయం సాధించిన విధంగానే 2026లో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో 200 స్థానాల్లో గెలిచేందుకు పార్టీ శ్రేణులంతా ఇప్పటి నుండే కృషి చేయాలని డీఎంకే అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(CM MK Stalin) పిలుపునిచ్చారు. తేనాంపేటలోని అన్నా అరివాలయం కలైంజర్ అరంగంలో డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్టాలిన్(CM MK Stalin) మాట్లాడుతూ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 39 సీట్లలో గెలిచిన డీఎంకే కూటమి, 2024 ఎన్నికల్లో 40 స్థానాలను కైవశం చేసుకుందని, రాష్ట్రంలో వరుసగా లోక్‌సభ ఎన్నికల్లో రెండు సార్లు ఘనవిజయం సాధించిన పార్టీ ఏదీ లేదన్నారు.
ఈ విజయానికి పార్టీ నేతలు, మంత్రులు, జిల్లా కార్యదర్శులు సమష్టి కృషి కారణమని ప్రశంసిస్తూ, పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే 40కి 40 స్థానాలు గెలుచుకుంటామని ప్రకటించామని, ఆ విధంగానే రాబోవు శాసనసభ ఎన్నికల్లో 200 సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రజానీకం డీఎంకే ప్రభుత్వంపై చూపించే ఆదరాభిమానాలను పరిశీలించిన మీదటే శాసనసభ ఎన్నికల్లో 200 సీట్లు సునాయాసంగా గెలుచుకోవడం ఖాయమన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల నుండి ఇటీవల జరిగిన విక్రవాండి ఉప ఎన్నికల వరకు పార్టీ ప్రజాభిమానాన్ని చూరగొని ఘనవిజయం సాధించగలగటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సారి కూడా రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుందని స్టాలిన్(CM MK Stalin) ధీమా వ్యక్తం చేశారు.
CM MK Stalin Comment
డీఎంకే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని, ఏదో ఒక ప్రభుత్వ పథకం వల్ల ప్రతి ఇంటా ఓ వ్యక్తి ఖచ్చితంగా లబ్ధి పొంది ఉంటారని, ఈ విషయాన్ని కార్యకర్తలు, జిల్లా కార్యదర్శులు గుర్తుంచుకుని ప్రచారం చేయాలని కోరారు విదేశీ పెట్టుబడుల కోసం తాను ఈ నెల 27న అమెరికా వెళ్తున్నానని, ఈ సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం డీఎంకే వజ్రోత్సవాల (త్రివిధ ఉత్సవాల) ఏర్పాట్లపై దృష్టిసారించాలని, తాను అమెరికాలో ఉన్నా, పార్టీ అధిష్టానవర్గం ద్వారా పనులను పరిశీలిస్తానని చెప్పారు. ఆదివారం జరిగే డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి వంద రూపాయల నాణెం ఆవిష్కరణ సభకు పార్టీ నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీఎంకే ఆవిర్భవించి 75 యేళ్లు పూర్తయ్యాయని, భారతదేశంలోనే తొట్టతొలిసారిగా ఓ ప్రాంతీయ పార్టీ అధికారాన్ని కైవశం చేసుకున్న రాష్ట్రంగా రాష్ట్రంగా పేరుగడించిందని, 75 యేళ్ల తర్వాత కూడా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ కూడా డీఎంకేయేనని స్టాలిన్(CM MK Stalin) సభికుల హర్షధ్వానాల నడుమ తెలిపారు. ప్రస్తుతం ద్రావిడ సిద్ధాంతాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ సమావేశంలో మూడు తీర్మానాలను ప్రతిపాదించి ఆమోదించారు. డీఎంకే ఆవిర్భవించి 75 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో సెప్టెంబర్ 17న పార్టీ వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా జరపాలని ఓ తీర్మానాన్ని జిల్లా కార్యదర్శులందరూ ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి పుదుచ్చేరి సహా 40 స్థానాల్గో గెలిపించినందుకు పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక తీర్మానం చేశారు. డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి రూపంతో వంద రూపాయాల నాణేన్ని ముద్రించేందుకు ఆమోదించిన కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ మూడో తీర్మానం చేసి ఆమోదించారు.
ఆ తీర్మానంలోనే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి పధకాలు ప్రకటించకుండా, నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసన వ్యక్తం చేశారు.. రైల్వే పథకాల్లోనూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా ఖండించారు. ఈ సమావేశంలో మంత్రులు దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఐ.పెరియసామి, పొన్ముడి, ఉదయనిధి స్టాలిన్, గీతా జీవన్, తంగం తెన్నరసు, కేకేఎ్‌సఎ్‌సఆర్ రామచంద్రన్, దామో అన్బరసన్, ఏవీ వేలు, అనితా రాధాకృష్ణన్, ముత్తుసామి, ఎంపీలు ఎ. రాజా, అందియూరు సెల్వరాజ్, కనిమొళి, పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భారతి, పార్టీ అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్, అన్బగలం కళై, ఎస్ ఆస్టిన్, పి. తాయగం కవి పాల్గొన్నారు. ఈ సమావేశానికి 72 మంది జిల్లా శాఖ కార్యదర్శులు హాజరయ్యారు.
Also Read : IPS Officers: మూకుమ్మడి సెలవులో వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్‌లు !