కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనా కాంగ్రెస్ పార్టీ ఇంకా సీఎం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఇంకా దోబూచులాడుతోంది. గతంలో సీఎంగా పని చేసిన సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివకుమార్ మధ్య పోటీ పెరిగింది. పైకి కనిపించక పోయినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది. అతిరథ నాయకులు ఉన్నప్పటికీ ఇంకా ఎవరనేది తేల్చకుండా నాన్చుతోంది. దీనికి ఎంత త్వరగా పుల్ స్టాప్ పెట్టకపోతే పార్టీకి అంత నష్టం. ఈనెల 13న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. సీఎల్పీ సమావేశం కూడా ముగిసింది. కానీ సీల్డ్ కవర్ లో పరిశీలకుల కమిటీ హై కమాండ్ కు అందజేసింది.
ఉన్నది ఒకే ఒక్క కుర్చీ. కానీ దానిపై పలువురు కన్నేసినా ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. మ్యూజికల్ చైర్ గా మారి పోయింది. కర్ణాటక రాజకీయం మరింత వేడిని కలిగిస్తుంటే స్పష్టమైన మెజారిటీ ఇచ్చినా ఎందుకని పార్టీ సీఎం అభ్యర్థిని ఎంపిక చేయలేక తాత్సారం చేస్తోందంటూ సదరు సామాన్యులతో పాటు పార్టీ క్యాడర్ ఆలోచనలో పడి పోయింది. ప్రస్తుతం అంపశయ్యపై కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్ కు ప్రాణం పోశారు భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వాన్ని కాదన్నారు అక్కడి ప్రజలు. కాంగ్రెస్ జెండా ఎగురవేసింది అనూహ్యంగా.
ఇక కర్ణాటకలో సైతం ఆ పార్టీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. ఆ పార్టీని సైతం విస్తుపోయేలా చేశాయి. ఇది పక్కన పెడితే ఓ వైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తలలు పట్టుకుని కూర్చున్నా ఖరారు చేయక పోవడం ఒకింత విస్తు పోయేలా చేస్తోంది. స్థిరమైన ప్రభుత్వానికి ఓటు వేసినా అస్థిరమైన నిర్ణయాలు కొంప ముంచేలా చేస్తాయేమోనన్న ఆందోళన నెలకొంది. పోస్టర్ల వార్ మొదలైంది. మాటల తూటాలు పేలుతున్నాయి. తాను కూడా ఉన్నానంటూ మరొకరు రంగంలోకి దిగారు. ఇంకొందరు పార్టీ హైకమాండ్ కు విధేయులం అంటూనే లోలోపట గ్రూపులు కడుతున్నారు. ఇదేమని అంటే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని సమాధానం వస్తోంది.
పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావడంలో డీకే శివకుమార్ కృషి చేశాడు. ఇక క్లీన్ ఇమేజ్ తో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు సిద్దరామయ్య. ఇద్దరిలో ఎవరిని ఖరారు చేయాలో తెలియక తల్లడిల్లుతోంది సోనియా గాంధీ. పార్టీకి చీఫ్ ఖర్గే అయినా మేడం నిర్ణయం సుప్రీం అని చెప్పక తప్పదు. సీఎం ఎంపిక విషయంపై ఇంకా తాత్సారం చేస్తూ పోతే ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంటుంది. ఆపై ఆశావాహులు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఏ మాత్రం ఛాన్స్ చిక్కినా ఎగరేసుకు పోయేందుకు బీజేపీ రెడీగా ఉంటుంది. ఇకైనానై హైకమాండ్ పునరాలోచించాలి. వెంటనే ఎవరినో ఒకరిని ప్రకటించి ఉత్కంఠకు తెర దించాలి.
