Congress Leader Mastan Vali: రాజకీయ లబ్ది కోసంమే తెరపైకి వైఎస్ మరణం- కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ
రాజకీయ లబ్ది కోసంమే తెరపైకి వైఎస్ మరణం- కాంగ్రెస్ నేత మస్తాన్ వలీ
Congress Leader Mastan Vali: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత… ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. దీనికి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని రాష్ట్రంలోని అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే కారణంగా కనిపిస్తోంది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందంటూ వైఎస్సార్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు షర్మిల కాంగ్రెస్ లో చేరడం వలన తమ పార్టీకు వచ్చిన నష్టం ఏమీ ఉండదంటూ ఆయన స్పష్టం చేసారు. దీనితో సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలపై ఏపి కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా యాక్టివ్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఏపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ… సజ్జల వ్యాఖ్యలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసారు.
Congress Leader Mastan Vali – షర్మిలను విమర్శించే అర్హత సజ్జలకు లేదు- షేక్ మస్తాన్ వలీ
గుంటూరు వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ… ‘‘దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీకు సేవలందించింది. ఒక్క జగన్ మాత్రమే కాంగ్రెస్ పార్టీని వీడారు. రాహుల్ గాంధీని ప్రధాని మంత్రి చేయడానికి రాజశేఖర్ రెడ్డి కృషి చేశారు. దీనితో తండ్రి కలలను నిజం చేసేందుకే షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చారు. వైసిపి నాయకుల వైఖరి నచ్చకే పార్టీకి ఆమె దూరమయ్యారు.
రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలు ఉంటే సజ్జల ఈ ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు ? ఆయన మృతిపై విచారణకు ఎందుకు డిమాండ్ చేయలేదు ? కేవలం రాజకీయాల కోసమే వైఎస్ మృతిని మళ్లీ తెరపైకి తెచ్చారు. వివేకా హత్య కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేదు ? ప్రధాని మోదీకి సీఎం జగన్ పూర్తిగా లొంగిపోయారు. రాష్ట్రాన్ని ఆయన వద్ద తాకట్టుపెట్టారు’’ అని ఆయన విమర్శించారు. షర్మిల కాంగ్రెస్(Congress) పార్టీలో చేరిన తరువాత వైసిపి నాయకులకు భయం పట్టుకుందని ఆరోపించారు. అంతేకాదు వైఎస్ షర్మిలను విమర్శించే అర్హత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని ఆయన స్పష్టం చేసారు. దీనితో రాష్ట్ర విభజన తరువాత చాలా సైలంట్ గా ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు షర్మిల రాకతో యాక్టివ్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read : Chandrababu Naidu : తిరువూరు ‘ రా కదలిరా ‘ సభలో బాబు వాగ్దానాలు