కర్ణాటక ఎన్నికల ఫలితాలపై స్పందించారు ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బలవంతులపై బలహీనులు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. క్రోనీ క్యాపిటిలజం ప్రజల బలం ముందు ఓడి పోయిందన్నారు. తమ పార్టీ పేదలు, సామానులకు రక్షణగా ఉంటుందన్నారు. ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులకు, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. కర్ణాటక ప్రజలు డబ్బులను తిరస్కరించారని పేర్కొన్నారు. అవినీతిపై ధర్మం గెలిచిందన్నారు. తాము ఎన్నికల సందర్భంగా ఏం హామీలు ఇచ్చామో వాటిని ముందు నెరవేరుస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ప్రజల ప్రేమ ముందు భారతీయ జనతా పార్టీ , దాని అనుబంధ సంస్థలు వెదజల్లిన ద్వేషం ఓడి పోయిందన్నారు. ఇవే ఫలితాలు ఇతర రాష్ట్రాలలో కూడా కొనసాగడం ఖాయమని జోష్యం చెప్పారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినెట్ సమావేశంలోనే పార్టీ హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇది పూర్తిగా పార్టీ విజయంగా తాము భావించడం లేదన్నారు. ఇది పూర్తిగా కర్ణాటక ప్రజలు సాధించిన గెలుపు గా పేర్కొన్నారు రాహుల్ గాంధీ.
