ఐపీఎల్ 16వ సీజన్ లో వరుసగా డేవిడ్ మిల్లర్ సత్తా చాటుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్ మరోసారి మెరిశాడు. కీలకమైన లీగ్ మ్యాచ్ లో విలువైన పరుగులు చేశాడు. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ తో పాటు అభినవ్ మనోహర్ తోడయ్యాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలోనే గుజరాత్ త్వరగా రెండు వికెట్లు కోల్పోయినా ఆ తర్వాత ఎక్కడా వెనుదిరగలేదు. పరుగులు చేసుకుంటూ పోయారు.
ఎప్పటి లాగే ఈ సీజన్ లో సీరియస్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్. 34 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్ కళ్లు చెదిరే షాట్స్ తో రెచ్చి పోయాడు. 56 రన్స్ చేశాడు. అనంతరం బరిలోకి దిగిన డేవిడ్ మిల్లర్ షాన్ దార్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బాల్స్ ఎదుర్కొని 46 పరుగులు చేశాడు. ఇక అభినవ్ మనోహర్ మిల్లర్ తో కలిసి స్కోర్ బోర్డు పరుగెత్తించాడు. 21 బంతులు ఎదుర్కొని 42 రన్స్ చేశాడు.
208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 152 పరుగులకే చాప చుట్టేసింది. ఆఫ్గనిస్తాన్ బౌలర్లు నూర్ అహ్మద్ , రషీద్ ఖాన్ చుక్కలు చూపించారు. కళ్లు చెదిరే బంతులతో ముప్పు తిప్పలు పెట్టారు. రషీద్ ఖాన్ 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొడితే నూర్ అహ్మద్ 37 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు.