Deputy CM Pawan : ఏపీలో బాలిక హత్యాచార ఘటనపై ఘాటుగా స్పందించిన డిప్యూటీ సీఎం

అనంతరం ఆ వ్యక్తి చిన్నారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు...

Deputy CM Pawan : పిఠాపురంలో బాలికపై అత్యాచారం ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. పట్టణానికి చెందిన బాలికకు మద్యం తాగించి మరీ అత్యాచారం చేశారని తెలిసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు డిప్యూటీ సీఎం(Deputy CM Pawan) చెప్పారు. మాధవపురం చెత్త డంపింగ్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు  చెప్పారు. ఈ అఘాయిత్యం చాలా బాధ కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార సమయంలో అప్రమత్తమైన స్థానికులు నిందితుణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. వారి ద్వారానే ఘటన వెలుగులోకి వచ్చిందన్నారు. లేకుంటే నిందితుడు తప్పించుకునేందుకు ఆస్కారం ఉండేదని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు.

Deputy CM Pawan Slams

ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలికను పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం పవన్(Pawan Kalyan) ఆదేశించారు. బాధితురాలికి, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అతణ్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్థానిక జనసేన నాయకులు సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పి, సహాయం అందించాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) కోరారు.

కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం స్టువర్టుపురం ప్రాంతంలో ఓ బాలిక సోమవారం మధ్యాహ్నం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన ఓ మహిళ, మరో వ్యక్తి ఆమె వద్దకు వచ్చి ఆటో ఆపారు. కాగితం చూపిస్తూ అడ్రస్ చెప్పాలంటూ కోరారు. అనంతరం బాలిక ముఖంపై మత్తు మందు స్ప్రే చేశారు. ఆమె స్పృహ తప్పి పడిపోగానే వెంటనే ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారు మాధవపురం డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారు. మెలకువ వచ్చిన బాలికకు బలవంతంగా మద్యం తాగించారు.

అనంతరం ఆ వ్యక్తి చిన్నారిపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. చిన్నారి అపస్మారక స్థితికి చేరుకోగానే భయపడిన నిందితులిద్దరూ బాలికను ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. అయితే డంపింగ్ యార్డు వద్దకు వచ్చిన ఓ మహిళ ఈ దారుణ ఘటనను చూసింది. అనుమానం వచ్చి వారిని పలు ప్రశ్నలు అడిగింది. అనంతరం స్థానికులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వచ్చిన పలువురు యువకులు ఇద్దరినీ పట్టుకున్నారు. అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందించారు. బాలికను గుర్తుపట్టిన కొంతమంది చిన్నారి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దారుణానికి పాల్పడిన కామాంధుడు ఓ పార్టీకి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.

Also Read : Minister Ponnam : రవాణా శాఖలో మార్పులపై కీలక నిర్ణయం తీసుకున్న మంత్రి పొన్నం

Leave A Reply

Your Email Id will not be published!