ఝార్ఖండ్ డైనమెంట్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ దుమ్ము రేపుతోంది. గత ఐపీఎల్ సీజన్ లో అంతగా ఆకట్టుకోని ఈ జట్టు ఈసారి ఐపీఎల్ 16వ సీజన్ లో చుక్కలు చూపిస్తోంది. అసాధారణ విజయాలు నమోదు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్ లలో కంటే అత్యధిక స్కోర్ ను నమోదు చేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 235 రన్స్ చేసింది. 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ చేతులెత్తేసింది. 49 పరుగుల తేడాతో ఓడి పోయింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డేవిడ్ కాన్వే ఆరంభం నుంచే దాడి చేయడం మొదలు పెట్టాడు.
వరుసగా ఆ జట్టుకు కీలకంగా మారాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరిస్తూ వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేవలం 40 బాల్స్ ఎదుర్కొన్న డేవిడ్ కాన్వే 4 ఫోర్లు 3 సిక్స్ లతో రెచ్చి పోయాడు. ఏకంగా 56 కీలకమైన పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన శివమ్ దూబే , రహానే లు కోల్ కతా బౌలర్ల భరతం పట్టారు. తమకు ఎదురే లేదని చాటారు. మొత్తంగా ఇరు జట్ల మధ్య ఈడెన్ పరుగుల వరదతో ఉబ్బితబ్బిబ్బయింది.
