Bhatti Vikramarka : జల విద్యుత్ ఉత్పత్తికి కీలక ఉత్తర్వులు జారీ చేసిన డిప్యూటీ సీఎం
సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు...
Bhatti Vikramarka : జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి చీఫ్ ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నందున వీలైనంత ఎక్కువ ఉత్పత్తిపై థర్మల్, హైడల్ ప్రాజెక్టుల సీఈలు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన థర్మల్, హైడల్ విద్యుత్ ఉత్పాదకతకు సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ఆ శాఖల సీఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు.
Bhatti Vikramarka Comment
థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్లాంట్లో కనీసం 17రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు నిబద్ధతతో పని చేయాలని స్పష్టం చేశారు. పనిలో నిర్లక్ష్యం, అలసత్వాకి తావు లేదని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అంటేనే ప్రజల కోసం నిరంతరం పని చేసే శాఖ అని చెప్పుకొచ్చారు. 24/7 పని చేయాల్సిన అత్యవసర శాఖ అనే విషయాన్ని అధికారులు, సిబ్బంది గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు.
విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అధికారులకు చెప్పారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే గతంలో శ్రీశైలం, జూరాల వంటి హైడల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని, తద్వారా ఏర్పడిన నష్టం గురించి అధికారులకు వివరించారు. ఇకపై నిర్ణయాలు తీసుకోవడంలో అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదని చెప్పారు. ఇందుకుగాను వారానికి ఒకసారి విద్యుత్ కేంద్రాల పరిస్థితి, ఉత్పాదకతకు సంబంధించిన నివేదికలు తనకు పంపాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
విద్యుత్ శాఖలో పని చేసే ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వినేందుకు, పరిష్కరించేందుకు తాను 24గంటలూ అందుబాటులో ఉంటానని డిప్యూటీ సీఎం భట్టి(Bhatti Vikramarka) చెప్పారు. ఒకవేళ తాను అందుబాటులో లేకుంటే సమస్యలను విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రాజెక్టులకు సంబంధించి సీఈలు నిర్లక్ష్యం వహించినట్లుగా ఉంటే రాతపూర్వకంగా వారి నుంచి వివరణ తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్ కో జేఎమ్డీ శ్రీనివాస్, ఎనర్జీ ఓఎస్డీ సురేందర్ రెడ్డి, జెన్కో డైరెక్టర్లు, సీఈలు హాజరయ్యారు.
Also Read : Manish Sisodia : నిజాయితీకి ప్రతిరూపం సీఎం అరవింద్ కేజ్రీవాల్