ECI: ఓటరు కార్డులపై మమత వ్యాఖ్యలకు ఎన్నికల కమీషన్ క్లారిటీ !
ఓటరు కార్డులపై మమత వ్యాఖ్యలకు ఎన్నికల కమీషన్ క్లారిటీ
ECI : బెంగాల్ ఓటర్ల జాబితాల్లో హరియాణా, గుజరాత్ లకు చెందిన నకిలీ ఓటర్లను బీజేపీ చేర్చుతోందని… ఇందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సహకరిస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై ఎన్నికల(ECI) కమీషన్ తీవ్రంగా స్పందించింది. ఎపిక్ నంబర్ ఒకలా ఉన్నంత మాత్రాన అవి నకిలీ/డూప్లికేట్ కార్డులు కావు. అన్నీ ఒరిజినల్ కార్డులే. వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విధమైన ఆల్ఫాన్యూమరిక్ సిరీస్ లను ఉపయోగించడం వల్ల కొందరు ఓటర్లకు ఒకే తరహా ఎపిక్ నంబర్ ఉన్న కార్డులు జారీ అయ్యాయి. కొందరు ఓటర్ల ఎపిక్ నంబర్లు ఒకే విధంగా ఉన్నా.. రాష్ట్రాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాలు వేర్వేరుగా ఉంటాయి.
ECI Responds Mamata Banerjee Comments
ఎపిక్ నంబర్‌తో సంబంధం లేకుండా.. తమ సొంత రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలోని నియోజకవర్గంలో, పోలింగ్ కేంద్రంలో ఓట్లు నమోదుచేసుకున్న ఏ ఓటరైనా ఓటేయవచ్చు’ అని ఈసీ(ECI) తన పత్రికా ప్రకటనలో తేల్చిచెప్పింది. అయితే బెంగాల్ సీఎం మమత బెనర్జీ పేరు ప్రస్తావించకుండా… రెండు రాష్ట్రాల ఓటర్లకు ఒకేరకమైన ఎపిక్ నంబర్లు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టులను పరిగణనలోకి తీసుకుని ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపింది.
ఈసీకి సంబంధించిన ఎలక్టొరల్ రోల్ మేనేజ్‌మెంట్ (ఎరోనెట్) ప్లాట్ ఫాంకు ఓటర్ల సమాచారం పంపేముందు రెండు విభిన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకేవిధమైన అల్ఫాన్యూమరిక్ సిరీస్ ను ఉపయోగించడం వల్ల తాజా సమస్య తలెత్తినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో రిజిస్టర్డ్ ఓటర్లందరికీ ఇకపై యూనిక్ ఎపిక్ నంబర్లు కేటాయించాలని ఈసీ(ECI) నిర్ణయించింది. అన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ డాటాబేస్‌ను సమీకృత ఎలక్టోరల్ రోల్ మేనేజ్‌మెంట్ (ఎరోనెట్) ప్లాట్‌ఫాంలోకి మార్చడానికి ముందు, అంటే కేంద్రీకృత వ్యవస్థను అమలుచేయని కాలంలో ఎపిక్ మాన్యువల్ గా నంబర్లను కేటాయించినప్పుడు ఇది జరిగింది. ఓటర్ల ఎపిక్ నంబర్లు ఒకేలా ఉండొచ్చు గానీ వారి వ్యక్తిగత వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ తదితర వివరాలన్నీ వేరుగానే ఉంటాయి. అలాంటి ఓటరు స్వరాష్ట్రంలో సంబంధిత నియోజకవర్గంలో నిర్దేశించిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేసేందుకు ఏ ఇబ్బందీ లేదు. అయినా భయాందోళనలుంటే అలాంటి వారికి ప్రత్యేక (యూనిక్) ఎపిక్ నంబర్‌ను కేటాయిస్తాం. అందుకు వీలుగా ఎరోనెట్ 2.0 ప్లాట్‌ఫాంను త్వరలో అప్‌డేట్ చేస్తాం’’ అని ఈసీ పేర్కొంది.
ఈ ప్రక్రియకు సహకరించేందుకు ఎరోనెట్ 2.0 ప్లాట్ ఫాంను ఆధునికీకరిస్తామని తెలిపింది. మమత ఆరోపణలను బెంగాల్ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) కూడా తోసిపుచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం… ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల(ECI) జాబితాల నవీకరణలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు), రిటర్నింగ్ అధికారులు(ఈఆర్‌వోలు), సహాయ రిటర్నింగ్ అధికారులు(ఏఈఆర్‌వోలు), జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవోలు), రాష్ట్రాల సీఈవోలు పాలుపంచుకుంటారని… రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లు క్రియాశీల పాత్ర పోషిస్తారని ఆదివారం ఓ ప్రకటనలో గుర్తుచేశారు. ఓటర్ల నమోదు, జాబితాలపై ఏవైనా అభ్యంతరాలుంటే వీరి ముందు ఉంచాలని… వాటిపై తక్షణమే దృష్టి సారిస్తున్నామని… దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక… అక్కడ 5 నెలల వ్యవధిలోనే 48 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని.. కానీ ఈ వ్యవహారంలో సీఈవో కార్యాలయానికి ఒక్క ఫిర్యాదు మాత్రమే చేసిందని ఈసీ వర్గాలు తెలిపాయి.
మమత అబద్ధం బట్టబయలు – బీజేపీ
మమత చెప్పిన మరో అబద్ధం బట్టబయలైందని బీజేపీ ఐటీ ఇన్‌చార్జి, బెంగాల్ బీజేపీ సహ ఇన్‌చార్జి అమిత్ మాలవీయ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆమె దుష్ప్రచారానికి ఒడిగట్టారని, ఎన్నికల వ్యవస్థపై ఓటర్ల విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. బెంగాల్లో ఓటర్ల ప్రక్షాళన జరపాలని ఈసీని కోరారు. అక్రమ బంగ్లాదేశీయులను, రోహింగ్యాలను ఓటర్ల జాబితాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
Also Read : Mayawati: మేనల్లుడు ఆకాశ్ కు షాక్ ఇచ్చిన బీఎస్పీ అధినేత్రి మాయావతి !