Election Commission Comment : ఎన్నికల సంఘం ప్రశ్నార్థకం
భవిష్యత్తు అగమ్య గోచరం
Election Commission Comment : సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును, కమిషనర్ల ఎంపికపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వ్యక్తం చేసిన అనుమానాలు, వెలిబుచ్చిన అభిప్రాయాలు, పారదర్శకతపై ప్రశ్నలు ఒకింత విస్తు పోయేలా చేశాయి.
137 కోట్ల భారతీయులు కలిగిన ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా నాలుగు పాదాల మీద నడుస్తుందంటే కారణం ఇంకా కొన్ని వ్యవస్థలు బలంగా నిలబడి ఉండడమే. ఇది కాదనలేని సత్యం. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఎన్నికల సంఘం గుర్తుకు వస్తుంది.
కానీ ఐదు లేదా ఆరు ఏళ్లకు నిర్వహించే ఈ ఎన్నికలు , అడపా దడపా నిర్వహించే ఉప ఎన్నికలు , అత్యున్నతమైన పదవులకు సంబంధించి
ఎన్నికలప్పుడు ఈసీ కీలకంగా మారుతుంది.
ఎందుకంటే ఆ పదవులు అత్యంత ప్రాధాన్యత కలిగినవి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలలో ఎన్నికల సంఘం(Election Commission) కూడా ఒకటి.
ఆ తర్వాత న్యాయ వ్యవస్థ. దీనిని పక్కన పెడితే ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీగా పేరొందిన ఇండియాలో ఇప్పుడు మరోసారి ఎన్నికల సంఘం పనితీరు, దాని పరిమితులు, ఎన్నికల కమిషనర్ల పాత్రపై చర్చకు రావడం విస్తు పోయేలా చేసింది.
ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ ఎన్నికల సంఘం తనకున్న పరిమితులను కూడా సరిగా వాడు కోవడం లేదని, యెస్ బాస్ అనేలా వ్యవహరిస్తుందనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేశాయి.
పలు పార్టీలు అభ్యంతరాలు లేవదీశాయి. వారి వారి ప్రయోజనాల కోసం విమర్శలు చేశారని అనుకున్నా వాస్తవానికి సర్వోన్నత న్యాయ స్థానం ధర్మాసనం సంధించిన ప్రశ్నలు సామాన్యులను, ప్రజలను ఆలోచింప చేసేలా ఉన్నాయి.
చట్టాలను చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఎంపీలు, వారు ఎన్నుకున్న ప్రధానమంత్రి, మంత్రుల చేతుల్లోనే. కానీ వీరిని ఎన్నుకునేది
ప్రజలు. వారు ఎన్నుకులే చేసేది ఎన్నికల సంఘం. మరి ఎంత పారదర్శకంగా, ఎంతటి బాధ్యతాయుతంగా ఉండాలి..వ్యవహరించాలి.
అలాంటి స్వయం సత్తాక ప్రతిపత్తి కలిగిన కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission) ఎందుకని నోరు మెదపలేక పోతోందని సాక్షాత్తు ధర్మాసనం ప్రశ్నించింది. ఒక రకంగా నిలదీసింది.
అవసరమైతే దేశ ప్రధాన మంత్రిని సైతం ప్రశ్నించే సత్తా ఈసీకి ఉండాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా దివంగత ఎన్నికల కమిషనర్ గా దేశ
చరిత్రలో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన టీఎన్ శేషన్ ను పదే పదే ప్రస్తావించింది. ఈ విషయంలో సీఈసీ ఆలోచించు కోవాల్సిన అవసరం ఉంది.
దేశంలో ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే ముందు ఎన్నికల సంఘం బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఎవరికీ తల వంచని, పూర్తి నిజాయితీతో, నిబద్దతతో , ప్రజల కోసం పని చేయాలి.
ఆ దిశగా ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించినప్పుడే ఈసీ మనుగడ సాగిస్తుంది. ప్రధానంగా ఎన్నికల సంఘం కీలక సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉంది.
నేరస్తులు, అక్రమాలకు పాల్పడిన వారు, అఘాయిత్యాలు, ఘోరాలు, నేరాలకు పాల్పడిన వారు, నేర చరిత్ర కలిగిన వారు, ఇరువురు భార్యలు ఉన్న వారు, అక్రమ ఆస్తులు కలిగిన వారు ఎవరూ పోటీలో నిలబడకుండా చేయాలి. అప్పుడే దేశం బాగు పడుతంది. కేంద్ర ఎన్నికల సంఘంపై నమ్మకం ఏర్పడుతుంది.
పార్టీలు, గుర్తులు, ఎన్నికలు నిర్వహించడమే కాదు ఆయా పార్టీలకు, నేతలకు ఆస్తులు , విరాళాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా నిఘా పెట్టిన
రోజున, నియంత్రించిన రోజున ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. లేక పోతే ఎన్నికల సంఘం ప్రశ్నార్థకంగా మిగిలి పోతుంది.
Also Read : డ్రెస్ కోడ్ అత్యంత ముఖ్యం – సీజేఐ