Elephant Whisperers Comment : బంధం భావోద్వేగాల సమ్మేళనం
ది ఎలిఫెంట్ విస్పరర్స్
Elephant Whisperers Comment : జీవన యానంలో బంధాలకు బలం ఎక్కువ. సమాజం అంటే ప్రకృతితో మమేకం కావడం అన్నది ముఖ్యం. ఎలాంటి ప్రచారానికి నోచుకోకుండా విశ్వ వేదికపై ఆస్కార్ ను స్వంతం చేసుకుంది ది ఎలిఫెంట్ విస్సరర్స్ . తెరపై కన్నీళ్లను ఆవిష్కరించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఒక రకంగా దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించినందుకు దర్శకురాలిని అభినందించ తప్పదు. మనుషులు, ఏనుగుల మధ్య ఉన్న బంధాన్ని ఇంత గొప్పగా చిత్రీకరించిన దాఖలాలు లేనే లేవు. రోజు రోజుకు అడవి అంతరించి పోతోంది. జంతువులు మాయమై పోతున్నాయి. మనుషులు పెరుగుతున్నారు. కానీ పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోంది.
ది ఎలిఫెంట్ విస్పరర్ అనేది కథ కాదు. కంట తడి పెట్టించే దృశ్యం. ప్రతి సన్నివేశం గాయపరుస్తుంది. ఆలోచింప చేస్తుంది. కన్నీళ్లను కార్చేలా చేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం. ఆర్ఆర్ఆర్ ప్రచార ఆర్భాటాన్ని తట్టుకుని నిటారుగా నిలబడింది.
బెల్లీ అనే గిరిజన మహిళ తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ ఉద్యానవనం మదుమలై వన్య ప్రాణుల అభయారణ్యంలోని దట్టమైన అడవుల గుండా చెప్పులు లేకుండా నడుస్తూనే ఉంది. ఆమె మాటల్లోనే నా జీవితంలో ఎన్నో కష్టాలు చవి చూశాను.
నా మాజీ భర్తను పులి చంపేసింది. ఆనాటి నుంచి అడవులంటే భయం. కానీ గిరిజన మహిళను. మా తరమంతా ఈ అడివినే నమ్ముకున్నారు. నేను కూడా రాను రాను దీనితో అలవాటు పడడం నేర్చుకున్నా. ఆమె కట్టునాయకన్ కమ్యూనిటీలో ఓ భాగం.
ఇది తర తరాలుగా ఏనుగుల సంరక్షణకు తనను తాను అంకితం చేసుకున్న గిరిజన సమూహం (తెగ). వీరి ముఖ్య ఉద్దేశం ఒక్కటే అడవి శ్రేయస్సు మాత్రమే. ఇదే సమయంలో అక్టోబర్ 2017లో కారులో ప్రయాణం చేస్తున్న చిత్ర దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ కంట పడింది.
ఇదే ఆమెను సినిమా చేసేందుకు ప్రేరేపించేలా చేసింది. ఒక రకంగా తాను కూడా వారితోనే గడిపేలా మార్చింది. కార్తికి గోన్సాల్వేస్ తన బాల్యాన్ని దక్షిణ భారత దేశంలోని ప్రకృతిలో, పరిసరాల్లో గడిపారు.
తల్లి జంతువులను ప్రేమిస్తే..తండ్రి ఫోటోగ్రాఫర్. ఆ ఇద్దరి ప్రేరణ ఆమెను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారేందుకు దోహద పడేలా చేసింది. గున్న ఏనుగు పేరు రఘు. అది కార్తికి కంట పడింది. ఎంత సరదాగా ఉంటుందో ఆశ్చర్య పోయింది.
ఆ గున్న ఏనుగు కేర్ టేకర్ బొమ్మన్ తో జత కలిపింది. ఆ తర్వాత ఆ గున్న ఏనుగు కథ గురించి చెప్పడం ప్రారంభించాక దాని ప్రేమలో తాను పడి పోయానని తెలిపింది కార్తికి గోన్సాల్వేస్. ఈ డాక్యుమెంటరీ బొమ్మన్ , బెల్లీ , పిల్ల ఏనుగు రఘుల ప్రయాణాన్ని హృద్యంగా చిత్రీకరించేలా చేసింది. గున్న ఏనుగు తల్లి విద్యుత్ షాక్ తో మృతి చెందింది. ఆ తర్వాత రఘు తట్టుకోలేక పోయింది.
దీనిని అటవీ శాఖ గుర్తించి చేరదీసి బొమ్మన్ వద్దకు అప్పగించడం..పెంచడం..దానితో అనుబంధం పెంచుకోవడం..ప్రతి దానిని ఫ్రేమ్ లో బంధించింది దర్శకురాలు. గున్న ఏనుగు బతుకుతుందని ఎవరూ అనుకోలేదు..కానీ వాళ్లు దానిని బతికించారు. తమ బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించారు. 450 గంటల కంటే ఎక్కువగా ఉన్న ఫుటేజీని కేవలం 40 నిమిషాలకు కుదించింది దర్శకురాలు.
ఏనుగులు చూస్తే భయ పడతాం(Elephant Whisperers Comment). కానీ వాటిని ప్రేమిస్తే చాలు.అవి మనతో స్నేహం చేస్తాయంటారు కార్తికి. ఏనుగుల సంఖ్య రాను రాను తక్కువవుతోంది. ఇవే కాదు మిగతా జంతువులు కూడా. వాటిని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందంటుంది.
ఇంత గొప్ప చిత్రాన్ని మనకు అందించేలా చేసినందుకు గునీత్ మోంగాకు రుణపడి ఉండాలి. ఒక రకంగా మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచినందుకు ఆ ఇద్దరికీ సలాం.
Also Read : సినీ లోకంపై తెలుగు పాట సంతకం