YS Jagan : మనం చేసిన మంచి, విలువలు విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష
కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరన్నారు...
YS Jagan : రేపల్లె నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్(YS Jagan) మాట్లాడుతూ…రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవని.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని, ఇది సృష్టి సహజమని చెప్పుకొచ్చారు. విలువలు, విశ్వసనీయతే శ్రీరామ రక్ష అని అన్నారు. ‘‘ వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిపిస్తుంది.. మనం చేసిన మంచి పనులు ఎక్కడికీ పోలేదు. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో ఉంది’’ అని పేర్కొన్నారు.
YS Jagan Comment
కార్యకర్తలు ఏ గ్రామంలోనైనా ఈ పనులన్నీ చేశామని గర్వంగా చెప్పుకోగలరన్నారు. చంద్రబాబులా అబద్ధాలు ఆడలేకపోయామని విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలతో పోటీపడలేకపోయామన్నారు. ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పినా.. ఇవాళ ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘‘ పిల్లలు రూ.15వేలు గురించి అడుగుతారు.. మహిళలు రూ.18వేలు గురించి అడుగుతారు.. పెద్దవాళ్లు రూ.48వేల గురించి అడుగుతారు.. మన హయాంలో ఇసుక మీద ప్రభుత్వానికి డబ్బులు వచ్చేవి.. ఇవాళ ఉచితం లేదు కానీ రెట్టింపు కన్నా, ఎక్కువరేట్లకు అమ్ముతున్నారు’’ అంటూ మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పారని.. ప్రజలను అబద్ధాలతో మోసం చేశారన్నారు. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. అన్నీ చేసిన వైసీపీకే ఇలా అయితే, ప్రజలను ఇంతలా మోసం చేసిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారో అని… చంద్రబాబుకు సింగిల్ డిజిట్ కూడా ఇవ్వరంటూ వ్యాఖ్యలు చేశారు.
పార్టీని వీడి మోపిదేవి వెంకట రమణ వెళ్లిపోవడం బాధాకరమన్నారు. మోపిదేవి వెంకటరమణ విషయంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. ఏరోజైనా మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామని చెప్పుకొచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. మండలిని రద్దు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆయన పదవిపోకుండా అడిగిన వెంటనే రాజ్యసభకు పంపామన్నారు. ఒక మత్స్యకారుడికి తొలిసారిగా రాజ్యసభ ఇచ్చిన ఘనత వైసీపీదన్నారు. ‘‘ ఇప్పుడు గణేష్‌కు మీ మద్దతు చాలా అవసరం.. కష్టాలు కొత్తేమీ కాదు.. రాజకీయాల్లో కష్టాలు శాశ్వతం కాదు. మా నాన్న ముఖ్యమంత్రి.. అయినా కష్టాలు వచ్చాయి. పెద్దవాళ్లంతా ఏకమయ్యారు, తప్పుడు కేసులు పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టారు, వేధించారు. అయినా ప్రజలు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించలేదా? మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడు’’ అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) పేర్కొన్నారు.
Also Read : India Govt : రాష్ట్రాల వారీగా పన్నుల వాటాను విడుదల చేసిన కేంద్ర సర్కార్