Nandigam Suresh : పోలీస్ కస్టడీలో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్
మరోవైపు నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో...
Nandigam Suresh : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను న్యాయస్థానం పోలీసు కస్టడికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచి 17వ తేదీ (మంగళవారం) మధ్యాహ్నం వరకు మంగళగిరి పోలీసులు రూరల్ స్టేషన్‌లో విచారించనున్నారు. తెలుగుదేశం ప్రధానకార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారించనున్నారు. రెండు రోజులు విచారణ విచారణ జరగనుంది. ప్రస్తుతం నందిగం సురేష్(Nandigam Suresh) గుంటూరు జిల్లా జైలులో ఉన్న విషయం తెలిసిందే. జిల్లా జైలు నుంచి పోలీసులు మంగళగిరి సీఎస్‌కు తరలించనున్నారు. కాగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నందిగం సురేష్(Nandigam Suresh)ను రెండు రోజుల పాటు పోలీసుల విచారణకు న్యాయస్థానం కస్టడీకి ఇచ్చింది.
విచారణకు సహకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు విచారణలో తేల్చనున్నారు. ఈ విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయడం, దూషించడం, భయపెట్టడం వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ విచారణకు తమ న్యాయవాదులను కూడా అనుమతించాలని నందిగం సురేష్(Nandigam Suresh) తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి ప్రత్యేక పిటిషన్ దాఖలు చేస్తే.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొంది. మరోవైపు నందిగం సురేష్ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Nandigam Suresh in Custody..
మరోవైపు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేతలు, ఎమ్మెల్సీలు శనివారం పోలీసు విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుల్లో వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ మంత్రి జోగి రమేశ్, వైసీపీ నేత దేవినేని అవినాశ్, న్యాయవాది ఒగ్గు గవాస్కర్ తమ పాస్‌పోర్టులను 48 గంటల్లో దర్యాప్తు అధికారులకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని మంగళగిరి రూరల్ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ముందుగా ఒగ్గు గవాస్కర్ పోలీసు స్టేషన్‌కు చేరుకోగా, దర్యాప్తు అధికారులు గంటకుపైగా విచారణ జరిపారు.
అనంతరం 3:35 గంటలకు ఎమ్మెల్సీ తలశిల రఘురాం, 4:10 గంటలకు దేవినేని అవినాశ్, ఆ తరువాత 5:05 గంటలకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, రాత్రి 7:55 గంటలకు జోగి రమేశ్ వచ్చారు. తమ పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారికి సరెండర్ చేశారు. కేసు దర్యాప్తు అధికారి అయిన మంగళగిరి రూరల్ సీఐ వై.శ్రీనివాసరావు విచారణలో భాగంగా పలు ప్రశ్నలను సంధించారు. అయితే, వైసీపీ నేతల నుంచి విచారణకు ఎలాంటి సహకారం లభించలేదని… ‘తెలియదు, సంబంధం లేదు, గుర్తులేదు’ అనే సమాధానాలు మాత్రమే వచ్చినట్టు సమాచారం. మంగళగిరి సర్కిల్ కార్యాలయంలో శనివారం రాత్రి వరకూ విచారణ కొనసాగింది. కేసు విచారణ సందర్భంగా మంగళగిరి పోలీసు స్టేషన్ వద్ద ప్రత్యేక బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణకు హాజరయ్యే వ్యక్తిని మాత్రమే లోపలకు అనుమతించారు.
Also Read : PM Narendra Modi : మరో ఆరు కొత్త ‘వందే భారత్’ రైళ్లను ప్రారంభించిన మోదీ