MA Khan : మాజీ ఎంపీ ఎంఏ ఖాన్ కాంగ్రెస్ కు రాజీనామా
పార్టీ పతనానికి రాహుల్ గాంధీ కారణం
MA Khan : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బలమైన మైనార్టీ నాయకుడిగా పేరొందిన మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంఏ ఖాన్(MA Khan) పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
ఈ మేరకు ఆయన సంచలన కామెంట్స్ చేశారు. 134 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవసాన దశలో ఉందన్నారు. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ అంటూ నిందించారు.
పార్టీకి భవిష్యత్తు లేదని అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు మాజీ ఎంపీ. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని తిరిగి పొంది దేశాన్ని ముందుకు నడిపించ గలదని ప్రజలను ఒప్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఎంఏ ఖాన్ కు గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో(Congress Party) అనుబంధం ఉంది. ఒక రకంగా ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.
ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీకి సుదీర్ఘ లేఖ రాశారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా గతంలో పని చేశారు. గతంలో పార్టీలో ప్రతి ఒక్కరికి విలువ ఉండేది.
కానీ ఇవాళ పార్టీలో ఆ స్థితి లేకుండా పోయిందని ఆరోపించారు ఎంఏ ఖాన్. ఏ పార్టీ అయినా మనుగడ సాగించాలంటే కార్యకర్తలు, నాయకులు, హైకమాండ్ మధ్య సమన్వయం అవసరమన్నారు.
ఇందుకు చర్చలు, సంప్రదింపులు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఆ ప్రక్రియ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదని మండిపడ్డారు.
కేవలం ఒకరు లేదా నలుగురితో కూడుకున్న కోటరీ చేతిలో పార్టీ ఉందన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీపై సింధియా సీరియస్