Sourav Ganguly : గంగూలీ ట్వీట్ కలకలం సర్వత్రా ఆగ్రహం
మహిళా జట్టుపై ఇలాగేనా కామెంట్ చేసేది
Sourav Ganguly : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బాస్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ లో జరిగిన 22వ కామన్వెల్త్ గేమ్స్ -2022లో మొదటిసారిగా మహిళల క్రికెట్ ను ప్రవేశ పెట్టారు.
ఈ సందర్భంగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడింది. ఆ జట్టు చేతిలో కేవలం 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రజత పతకంతో సరి పెట్టుకుంది.
విచిత్రం ఏమిటంటే 96 పరుగుల వరకు భారత్ అత్యంత పటిష్టవంతమైన స్థితిలో ఉంది. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ సత్తా చాటింది.
ఆసిస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. 65 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది. ప్రారంభం లోనే స్మృతీ మంధాన నిరాశ పరిచినా ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ , జెమీమాతో కలిసి పరుగులు పెట్టించింది.
కానీ ఎప్పుడైతే ఈ ఇద్దరు వెనుదిరిగారో 44 పరుగుల తేడాతో 8 వికెట్లను పారేసుకుంది. తీవ్ర వత్తిడికి లోనైంది. చివరి దాకా పోరాడాల్సిన ఆటగాళ్లు ఇలాంటి చెత్త ప్రదర్శన చేయడం, చేజేతులారా బంగారు పతకాన్ని కోల్పోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) .
రజతాన్ని సాధించినందుకు అభినందనలు తెలియ చేశారు. అదే సమయంలో మీరు నిరాశతో ఇంటికి వెళ్లడం ఖాయం అంటూ పేర్కొన్నాడు.
దీనిపై నెటిజన్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీసీఐ బాస్ గా ఉంటూ ప్రోత్సహించాలే తప్పా ఇలా కామెంట్ చేస్తారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు.
Also Read : శ్రీలంక పర్యాటక ప్రచారకర్తగా జయసూర్య