Gautam Adani Comment : అదానీ ‘విలవిల’ దేశం ‘వలవల’
ఆర్బీఐ ఆరా ఆర్థిక వ్యవస్థకు షాక్
Gautam Adani Comment : నిన్నటి దాకా భారత దేశంలో మోస్ట్ పాపులర్ వ్యాపారవేత్తగా , దిగ్గజ కుబేరుడుగా పేరొందారు గౌతం అదానీ. ఎందుకని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ కీలకమైన 36 పేజీల నివేదికను విడుదల చేసింది.
ఇందులో కీలకవైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ లో తప్పుడు లెక్కలతో మోసం చేస్తూ వచ్చారంటూ, ఏర్పాటు చేసిన అదానీ గ్రూప్ కంపెనీలలో తన వారికి చెందిన వారే బోర్డు డైరెక్టర్లుగా ఉన్నారని కుండ బద్దలు కొట్టింది.
ఇప్పటికే లక్షల కోట్లు నష్ట పోయారు. నిన్నటి దాకా ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతం అదానీ(Gautam Adani) ఉన్నట్టుండి పడిపోతూ వచ్చారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేశ్ అంబానీ అదానీని దాటేశారు. ఇద్దరు వ్యాపారవేత్తలు ప్రస్తుతం భారత్ లో టాప్ లో ఉన్నారు. ఇద్దరూ గుజరాత్ కు చెందిన వారు కావడం విశేషం.
ఎప్పుడైతే నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా కొలువు తీరారో ఆనాటి నుంచి నేటి దాకా గౌతం అదానీ హవా కొనసాగుతూ వచ్చింది. ఒకానొక సమయంలో ప్రధానితో పాటు గౌతం అదానీ(Gautam Adani) కూడా వెళ్లడం , ఆయనను పీఎం వ్యక్తిగతంగా ప్రమోట్ చేయడం విస్తు పోయేలా చేసింది.
ఇది కావాలని భారత దేశంపై జరిగిన దాడిగా అభివర్ణించారు గౌతం అదానీ. అదంతా తప్పుల తడక అంటూ కొట్టి పారేశారు. దీనిపై సీరియస్ గా స్పందించారు హిండెన్ బర్గ్ సంస్థ చైర్మన్ ఆండర్సన్. తాము అదానీ గ్రూప్ పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ప్రపంచంలో ఏ కోర్టులో కేసు వేసినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇప్పటికే దేశ సంపదను కొల్లగొట్టి విదేశాల్లో తలదాచుకున్న ఆర్థిక నేరస్థులు ఎందరో ఉన్నారు. ఇప్పుడు సీన్ రివర్స్ కానుందా అన్న అనుమానం కలుగుతోంది.
ఇదే సమయంలో భారత ప్రభుత్వ ఆధీనంలోని లాభాల బాటలో ఉన్న ..పేరొందిన జీవిత భీమా సంస్థ (ఎల్ఐసీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అదానీ గ్రూప్ లో భారీగా పెట్టుబడులు పెట్టింది. కానీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఈ రెండు సంస్థలు కలిసి పెట్టాయనేది తెలియ పర్చ లేదు.
ఈ రెండూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవే. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు పూర్తి వివరాలు అడుగుతున్నాయి. కానీ మోదీ పరివారం చెప్పేందుకు ఇష్ట పడడం లేదు.
వేల కోట్లు ఎందుకని అదానీ గ్రూపులో పెట్టాల్సి వచ్చింది. వీటిని ఎవరు పెట్టమని కోరారు. ఒకవేళ నష్టం వాటిల్లితే ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై క్లారిటీ లేదు ఇప్పటి దాకా. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ మౌనాన్ని వీడడం లేదు.
ఓ వైపు అదానీ గ్రూప్ కు చెందిన కంపెనీలకు చెందిన షేర్లు భారీ ఎత్తున పడి పోతున్నాయి. దీంతో దేశ ఆర్థిక రంగానికి కీలకమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన ప్రకటన చేసింది.
దేశంలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎన్ని వేల కోట్లు అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చాయనే దానిపై వివరాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. విశ్వసనీయ సమాచారం మేరకు లక్షల కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
విచిత్రం ఏమిటంటే అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లకు విలువే లేదంటూ ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ క్రెడిట్ సూసీ సంచలన ఆరోపణలు చేసింది. 7 లక్షల 35 వేల కోట్ల సంపద ఆవిరై పోయింది.
దీంతో గౌతం అదానీ 15వ స్థానానికి దిగజారాడు. రేపొద్దున ఇంకెంత దిగజారుతాడనేది చెప్పలేం. గత ఏడాది డిసెంబర్ నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 19.63 లక్షల కోట్లు.. ఇప్పుడు రూ. 11.86 లక్షల కోట్లు. ఈ విలువ ఎప్పటికప్పుడు దిగజారుతూ ఉంటుంది.
ఈ మొత్తం ప్రభావం దెబ్బకు మదుపరులలో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో రెండేళ్లలోనే భారీ ఎత్తున విలువ ఎలా పెరుగుతుందని హిండెన్ బర్గ్ ప్రశ్నించింది.
2021, 2022లలో రూ. 9.62 లక్షల కోట్ల నుంచి రూ. 19.63 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక్కడే అనుమానం వ్యక్తం చేసింది రీసెర్చ్ సంస్థ. ఇక అదానీ టోటల్ గ్యాస్ , ట్రాన్స్ మిషన్ , అదానీ పవర్ , ఇలా ప్రతి రంగంలో ఎంట్రీ ఇచ్చిన అదానీ(Gautam Adani) గ్రూప్ వ్యవహారం ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తిస్తోంది.
హిండెన్ బర్గ్ నివేదికలో దిమ్మ తిరిగే వాస్తవాలను వెల్లడించింది. గౌతం అదానీ సోదరుడు రాజేష్ అదానీ , బావ సమీర్ వోరా గురించి ప్రస్తావించింది. షెల్ ఎంటీటీలను ఉపయోగించి తప్పుడు లెక్కలు సృష్టించారంటూ ఆరోపించింది.
దీనిపై స్పందించింది సీరియస్ గా అదానీ గ్రూప్. తమపై కుట్ర జరిగిందని కోర్టులో తేల్చుకుంటామని పేర్కొంది. అయితే గౌతం అదానీ తెలివిగా దేశం పేరుతో జాతీయ వాదం ముఖంతో మోసానికి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆండర్సన్ . ఏది ఏమైనా అదానీ గ్రూప్ పై పడిన ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుందడంలో సందేహం లేదు.
Also Read : అదానీ రుణాలపై ఆర్బీఐ ఆరా