Gujarat High Court : ‘మోర్బీ’ చావుల పాపం పాలకులదే
గుజరాత్ సర్కార్ పై హైకోర్టు సీరియస్
Gujarat High Court : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది గుజరాత్ లోని మోర్బీ వంతెన కూలి పోవడం. ఈ ఘటనలో ఏకంగా 141 మంది ప్రాణాలు కోల్పోయారు. 177 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ మొత్తంగా ఘటనకు సంబంధించి పాలకులు, ఉన్నతాధికారులు, నిర్వహణకు అప్పగించిన కంపెనీ బాధ్యత వహించాలంటూ భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
తాజాగా గుజరాత్ హైకోర్టు(Gujarat High Court) ఈ ఘటన వ్యవహారంపై సీరియస్ అయ్యింది. ఆ చనిపోయిన కుటుంబాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించింది. ఆర్థిక సాయం చేయడంతో బాధ్యత తీరి పోతుందా అని నిలదీసింది. పూర్తిగా బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని మండిపడింది. ఈ ఘటనలో మీ కుటుంబీకులు చని పోతే మీరు ఇలాగే వ్యవహరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు.
మోర్బీ ఘటనపై హైకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా మోర్బీ మున్సిపాలిటీ యంత్రాంగంపై ఫైర్ అయ్యింది. వివరణ ఇస్తారా లేక లక్ష రూపాయల జరిమానా కడతారా అంటూ నిప్పులు చెరిగింది ధర్మాసనం.
ఈ సందర్భంగా కీలక ప్రశ్నలు లేవదీసింది. బ్రిడ్జి పరిస్థితి బాగోలేదని 2021, డిసెంబర్ 29న అజంతా మ్యానుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఓరెవా గ్రూప్ ) ఆనాటి మున్సిపాలిటీ ఆఫీసర్ కు విన్నవించినా ఎందుకు అనుమతి ఇచ్చారంటూ నిలదీసింది.
వంతెన మరమ్మత్తుల కోసం మూసి వేసిన బ్రిడ్జిపైకి ప్రజలను ఎలా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ , జస్తిస్ అశు తోష్ శాస్త్రిలతో కూడిన ధర్మాసనం నిలదీసింది. ఆమోదం లేకుండా ఓరెవా కంపెనీకి ఎలా అనుమతి ఇచ్చారో తెలపాలని ఆదేశించింది.
Also Read : పోలీసు శాఖలో మహిళలకు 35 శాతం – సీఎం