Gujarat Win Comment : గుజ‌రాత్ విజ‌యం దేనికి సంకేతం..!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రింత బ‌లం

Gujarat Win Comment : ఫ‌లితాలు వ‌చ్చాయి. గుజ‌రాత్ లో భార‌తీయ జ‌న‌తా పార్టీ(Gujarat Win) చ‌రిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో సీట్ల‌ను సాధించింది. రాష్ట్ర ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయాన్ని కాషాయం లిఖించింది. ఈ విజ‌యం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి ఓ టానిక్ లా ప‌ని చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కానీ ఇదే స‌మ‌యంలో మోదీ ప్ర‌భ త‌గ్గిందా అన్న అనుమానం రాక త‌ప్ప‌దు. ఎందుకంటే గుజ‌రాత్ తో పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. రెండు రాష్ట్రాల‌లో ఇప్ప‌టికే బీజేపీ అధికారంలో ఉన్న‌ది కూడా. కానీ ప్ర‌జ‌లు ఊహించ‌ని రీతిలో కాషాయానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు.

ఇక్క‌డ కూడా న‌రేంద్ర మోదీతో పాటు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ చంద్ర షా, కేంద్ర మంత్రులు, మొత్తం ప‌రివారం అంతా ప్ర‌చారం చేసింది. ప్ర‌యోగాలు చేసింది. వ్యూహాలు ప‌న్నింది. కానీ జ‌నం మార్పును కోరుకున్నారు. ఇదే స‌మ‌యంలో రాను రాను విద్వేష పూరిత రాజ‌కీయాల‌ను విస్మ‌రించే ద‌శ‌కు చేరుకున్నారన్న‌ది వాస్త‌వం.

దీనిని భార‌తీయ జ‌న‌తా పార్టీతో పాటు దానిని మోస్తున్న ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ ప‌రిష‌త్ , ఏబీవీపీ సంస్థ‌లు గుర్తించాలి. మ‌రో విష‌యం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం కూడా ఉంది. గ‌త కొంత కాలంగా ఢిల్లీపై క‌న్నేసిన బీజేపీ బ‌ల్దియాను నిలుపుకోలేక పోయింది. అక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ‌కు 15 ఏళ్ల సుదీర్ఘ పాల‌న నుంచి వైదొలిగింది.

అంటే అర్థం మూడు చోట్ల ఎన్నిక‌లు జ‌రిగాయి. రెండు రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగితే ఒక చోట దేశ రాజ‌ధానిలో పౌర ఎన్నిక‌లు ముగిశాయి. అంటే గుజ‌రాత్(Gujarat Win)  మాత్రమే మోదీకి ద‌క్కింది. కానీ మిగ‌తా రెండు చోట్ల ఆయ‌న‌కు మైన‌స్ అయ్యింద‌ని గుర్తించ‌క త‌ప్ప‌దు. ఎంత కాలం గుజ‌రాత్ మోడ‌ల్ ను ముందు పెట్టి దేశాన్ని పాలించ‌లేం.

ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం ఇంకో వైపు నిరుద్యోగం మ‌రో వైపు ప్ర‌భుత్వ ఆస్తుల అమ్మ‌కం కొన‌సాగుతూనే ఉంది. మెజారిటీ వ‌చ్చినంత మాత్రాన అధికారం జీవితాంతం అనుభ‌వించ‌మ‌ని కాదు అర్థం. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం అన్న‌ది లేక పోతే అది నియంతృత్వాన్ని క‌లుగ చేస్తుంద‌ని ఏనాడో మార్క్సిస్టు సిద్దాంత‌క‌ర్త కార్ల్ మార్క్స్ చెప్పారు.

మొత్తంగా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపు ఏక‌ప‌క్షంగా సాగింద‌ని అనుకుంటే పొర‌పాటే. ఒక ర‌కంగా ఆమ్ ఆద్మీ పార్టీ గ‌ణ‌నీయంగా ఓట్ల‌ను చీల్చింది. ఆ పార్టీ రాక‌తో బీజేపీకి మేలు జ‌రిగితే కాంగ్రెస్ పార్టీకి తీర‌ని న‌ష్టం మిగిల్చింది.

ఇక బీజేపీకి బి టీంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎంఐఎం సైతం మైనార్టీ ఓట్ల‌ను చీల్చ‌డంలో స‌క్సెస్ అయిన‌ట్లు విమ‌ర్శ‌లు లేక పోలేదు. ఏది ఏమైనా గుజ‌రాత్ విజ‌యం దేశానికి ప్ర‌మాద ఘంటిక‌ల‌ను మోగించ‌క త‌ప్ప‌దు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.

Also Read : గుజ‌రాత్ లో క‌మ‌లం ప్ర‌భంజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!