IND vs SA 3rd ODI : చేతులెత్తేశారు ప‌రువు తీశారు

పరాజ‌యం ప‌రిస‌మాప్తం చేశారు

IND vs SA 3rd ODI : క‌నీసం చివ‌రి వ‌న్డేలోనైనా గెలిచి ప‌రువు నిల‌బెడ‌తార‌ని ఆశించిన అభిమానుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు భార‌త ఆట‌గాళ్లు. స‌ఫారీ టూర్ లో అటు టెస్టు సీరీస్ తో పాటు ఇటు వ‌న్డే సీరీస్ కూడా పోగొట్టుకుని ఉట్టి చేతుల‌తో ప‌య‌న‌మ‌య్యారు.

సుదీర్ఘ క్రీడానుభ‌వం క‌లిగిన రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్ గా కొలువు తీరినా టీమిండియా ఆట తీరులో ఎలాంటి మార్పు క‌నిపించ లేదు.

క‌ర్ణుడి చావుకు కార‌ణాలు ఎన్నో అన్న‌ట్టు భార‌త జ‌ట్టు పేల‌వ‌మైన ఆట తీరుతో ప‌రాజ‌యం మూట గ‌ట్టుకుంది.

విచిత్రం ఏమిటంటే మొద‌టి, రెండో వ‌న్డే లు పూర్తిగా ఏక‌ప‌క్షంగా సాగితే కేప్ టౌన్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో(IND vs SA 3rd ODI) మాత్రం విజ‌యం భార‌త్ ను చివ‌రి దాకా ఊరించింది. ఆల్ రౌండ‌ర్ దీప‌క్ చాహ‌ర్ దుమ్ము రేపాడు.

అద్భుతంగా ఆడాడు. మైదానంలో ఉన్నంత వ‌ర‌కు స‌ఫారీ టీమిండియా గెలుస్తుంద‌ని అనుకున్నారు.

తీరా స‌ఫారీ బౌల‌ర్ల దెబ్బ‌కు భార‌త్ ఓట‌మి చ‌వి చూసింది.

చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ మ్యాచ్ లో టీమిండియా నాలుగు ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భార‌త్. 49. 5 ఓవ‌ర్ల‌లో 287 ప‌రుగుల‌కు ద‌క్షిణాఫ్రికా ఆలౌట్ అయింది.

ఆ జ‌ట్టు ఓపెన‌ర్ డికాక్ 12 ఫోర్లు 2 భారీ సిక్స్ ల‌తో 124 ప‌రుగులు చేశాడు. డ‌సెన్ 52 ప‌రుగుల‌తో రాణించాడు.

దీంతో బ‌రిలోకి దిగిన భార‌త జ‌ట్టు 49.2 ఓవ‌ర్ల‌లో 283 ప‌రుగుల‌కు చాప చుట్టేసింది.

ఓపెన‌ర్ ధావ‌న్ 61 ప‌రుగుల‌తో , కోహ్లీ 65 ప‌రుగుల‌తో రాణించారు. ఆ త‌ర్వాత ఎవ‌రూ ఆడ‌లేదు. ఆఖ‌రులో మైదానంలోకి వ‌చ్చిన దీప‌క్ చాహ‌ర్ 34 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 54 ప‌రుగులు చేశాడు.

48వ ఓవ‌ర్ లో ఎంగిడి అద్బుత‌మైన బంతికి అవుట్ చేయ‌డంతో భార‌త్ ఓడి పోయింది.

Also Read : మహిళ‌ల టీ20 ప్లేయ‌ర్ గా బ్యూమాంట్

Leave A Reply

Your Email Id will not be published!