Jay Shah : ఆసియా కప్ కోసం పాక్ కు భారత్ వెళ్లదు
సంచలన ప్రకటన చేసిన కార్యదర్శి జే షా
Jay Shah : బీసీసీఐ కొత్త కార్యవర్గం మంగళవారం కొలువు తీరింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగా కర్ణాటకకు చెందిన రోజర్ బిన్నీ ఎన్నికయ్యారు. ఇక ఎప్పటిలాగే అమిత్ షా తనయుడు జే షా(Jay Shah) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు.
ఇదిలా ఉండగా బీసీసీఐ కార్యదర్శి జే షా సంచలన ప్రకటన చేశారు. 2023లో పాకిస్తాన్ లో నిర్వహించే ఆసియా కప్ లో భారత క్రికెట్ జట్టు పాల్గొనబోదని వెల్లడించారు. ఒకవేళ ఆసియా కప్ ను తటస్థ వేదిక పై నిర్వహిస్తే అప్పుడు ఆడాలా వద్దా అనేది ఆలోచిస్తామని పేర్కొన్నారు. తీవ్ర ఉద్రిక్తల కారణంగా ఇప్పటి వరకు భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య మ్యాచ్ లు జరగడం లేదు.
కేవలం తటస్థ వేదికలపైనే ఢీకొంటున్నాయి. ఈ ఏడాది శ్రీలంకలో ఆసియా కప్ ను చేపట్టాల్సి ఉంది. కానీ శ్రీలంక దేశంలో చోటు చేసుకున్న ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా శ్రీలంక క్రికెట్ బోర్డు చేతులు ఎత్తేసింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తటస్థ వేదికగా దుబాయ్ ని ఎంపిక చేసింది.
ఇందులో పాక్, భారత్ ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్ గెలుపొందాయి. ప్రస్తుతం ఈ జట్లు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ ఈనెల 23న తలపడనున్నాయి. ఈ సందర్భంగా జే షా చేసిన ప్రకటన కలకలం రేపింది. దీనిపై ఇంకా పీసీబీ చైర్మన్ రమీజ్ రజా స్పందించ లేదు.
Also Read : బీసీసీఐ బాస్ గా రోజర్ బిన్నీ