Indian Constitution Comment : రాజ్యాంగం లేకపోతే రాచరికమే
ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం
Indian Constitution Comment : ఏ దేశానికైనా రాజ్యాంగం అన్నది అవసరం. అది లేక పోతే మనుగడ సాగించడం కష్టం. అత్యంత ప్రమాదం కూడా. దేశానికి దిశా నిర్దేశం చేస్తూ స్పూర్తి దాయకంగా నిలిచేందుకు అవసరమైన శక్తిని ఇచ్చే అద్భుతమైన సాధనం రాజ్యాంగం.
ఇవాళ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తోందంటే దానిని రూపొందించిన మహానుభావుడు, మహోన్నత మానవుడు కోట్లాది మంది భారతీయులు కొలిచే దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇక సెలవంటూ వెళ్లి పోయిన రోజు. మరి ఆయన తీర్చిదిద్దిన రాజ్యాంగం ఎలా ఉందంటే ఏం చెప్పగలం.
విలువలు పతనం అవుతున్నాయి. ప్రజాస్వామ్యం పేరుతో రాచరికం, నియంతృత్వం రాజ్యం ఏలుతున్నది. ప్రాథమిక హక్కులకు రక్షణ లేకుండా పోతోంది. వ్యవస్థలన్నీ మెల మెల్లగా నిర్వీర్యం అవుతూ వస్తున్నాయి.
దీని వెనుక కలుషితమైన రాజకీయ వ్యవస్థ ఆక్టోపస్ లాగా అల్లుకు పోయింది. దీనిని నిర్మూలించాలంటే ఏం చేయాలి. ప్రజలు మారాలా లేక పాలకులలో మార్పు రావాలా. ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు.
ప్రపంచంలోనే చైనా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశమైన భారత దేశం ఇవాళ ఎందుకని ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఎప్పుడైనా ఆలోచించామా. లేనే లేదు.
ఎందుకంటే బతకడం గగనమై పోయింది. సమాజంలో వర్గాలు, కులాలు, మతాలు, విద్వేషాలు, రాజకీయాలు, మోసాలు, హత్యలు, దారుణాలు, అత్యాచారాలు పెచ్చరిల్లి పోయాయి. దేశానికి దిక్సూచిగా ఉంటూ వస్తున్న రాజ్యాంగం నిర్దేశించిన నియమాలు, సూత్రాలను ఏమైనా పాటిస్తున్నాయా ప్రభుత్వాలు. వాటిని నియంత్రిస్తున్న పాలకులు.
ఇప్పుడు దేశం సంక్షోభంలో ఉంది. ప్రత్యేకించి టెక్నాలజీ పేరుతో, వ్యాపార, వాణిజ్య, మార్కెట్ మాయాజాలం దోపిడీ చేస్తోంది. కోట్లాది ప్రజల భావోద్వేగాలను నియంత్రిస్తోంది. దీనిని ప్రోత్సహిస్తున్నది ఎవరు.
హక్కులను కాల రాస్తున్నది ఎవరు. పాలకులు కాదా..బాధ్యతా రాహిత్యమనే భ్రమలో జనాల్ని ఉంచేసి జోగుతున్నది ఎవరో తెలియదా. విద్య, వైద్యం, న్యాయం అన్నది అందనంత వరకు దేశంలో ప్రజాస్వామ్యం లేనట్టేనని ఆనాడే హెచ్చరించాడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్.
మతం ఇవాళ రాజకీయ నినాదంగా మారింది. ప్రజాస్వామ్యం పరిహాసంగా మారింది. నోట్ల కట్టల ప్రభావంలో ఓటు చిక్కుకుని విలవిల లాడుతోంది. దేశానికి మూల స్తంభం ప్రజాస్వామ్యం..దానిని పరిరక్షించే రాజ్యాంగం(Indian Constitution) .
దేశ అత్యున్నత న్యాయ స్థానం ఎన్నికల వ్యవస్థపై సీరియస్ కామెంట్స్ చేసే స్థాయికి దిగజారి పోయింది దేశ పాలనా వ్యవస్థ. ప్రధానమంత్రిని సైతం నిలదీసే ఎన్నికల కమిషనర్ .ఎన్నికల సంఘం ఉండాలని స్పష్టం చేసింది..కుండ బద్దలు కొట్టింది సుప్రీంకోర్టు. ఇది దేనికి సంకేతం.. అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా.
అపరితమైన స్వేచ్ఛను కోరుకోవడం లేదు..కానీ ఎటువైపున ఉన్నామనేది ఆలోచించు కోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఈ దేశంలో ఇంకా నిరక్షరాస్యత రాజ్యమేలుతోంది. అంతేనా ఆకలి కేకలతో అల్లాడుతున్న జనం ఎందరో. అందుకే ఏ ఒక్కరూ ఖాళీ కడుపులతో ఉండేందుకు వీలు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
అలా ఉంటే ప్రజాస్వామ్యం లేనట్టేనని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ప్రజలు మారాలి..వాళ్లల్లో మార్పు రానంత వరకు నియంతృత్వమే రాజ్యం ఏలుతుంది.. రాచరికం రాజ్యాంగాన్ని కప్పేస్తుంది. తస్మాత్ జాగ్రత్త.
Also Read : ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం కావాలి – అజిత్ దోవల్