Jaiswal Rinku Singh Comment : కలల్ని నిజం చేసిన కుర్రాళ్లు
రింకూ సింగ్..యశస్వి జైస్వాల్
Jaiswal Rinku Singh Comment : ఔను వాళ్లిద్దరూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించండి. మీరు విజేతలు కావడం ఖాయం అని దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెబుతూ ఉండే వారు. గెలుపునకు దగ్గరి దారులంటూ ఏవీ లేవు. ఉన్నది కష్టపడటం. అలుపు అన్నది లేకుండా అనుకున్నది సాధించేంత దాకా ప్రయత్నం చేయడమే. ఆ ఇద్దరూ కుర్రాళ్లే. మనలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే. కానీ వాళ్లు ఎంచుకున్న మార్గం అనితర సాధ్యం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చరిత్ర సృష్టించిన వాళ్లను చూసి మేం నిత్యం స్పూర్తి పొందుతాం. కానీ ఏదో ఒక రోజు తమకంటూ ఓ చరిత్ర తప్పక ఉండి తీరుతుందని నమ్మిన వాళ్లు. అత్యంత సామాన్య పేదరికం నుంచి వచ్చిన ఆ ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఎందుకంటే వాళ్లిద్దరూ ఇప్పుడు ఛాంపియన్లుగా నిలిచారు. క్రికెట్ రంగంలో పరుగుల వరద పారిస్తున్నారు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ లో దుమ్ము రేపారు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్(Yeshsvi Jaiswal). కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న రింకూ సింగ్(Rinku Singh). ఇద్దరూ యువకులే. పేదరికం కాటు వేసినా తట్టుకుని నిలబడ్డారు. విజేతలుగా నిలిచారు. ఇప్పుడు దేశం యావత్తు వీరిని చూసి గర్విస్తోంది. జైస్వాల్(Yeshsvi Jaiswal) తండ్రికి తోడుగా పానీ పురి అమ్మాడు. కానీ ఎక్కడా సిగ్గు పడలేదు. ఎందుకంటే తన లక్ష్యం ఒక్కటే ఏదో ఒక రోజు భారత జట్టుకు ఆడాలని. ఆ కలను సాకారం చేసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. తినేందుకు సరైన తిండి లేదు. ఆడేందుకు శక్తి లేదు. చేతుల్లో డబ్బులు లేవు. కానీ కోరిక మాత్రం చావలేదు. అదే పాని పూరి అమ్ముకుంటూనే గల్లీలో క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు.
స్వస్థలం యూపీ. 11 ఏళ్ల వయస్సులో ముంబైకి వచ్చాడు. రేయింబవళ్లు ఆడటంపైనే ఫోకస్ పెట్టాడు. అండర్ -19 కు ఎంపికయ్యాడు. ఆనాటి నుంచి ఐపీఎల్ కు ఎంపికయ్యే దాకా వెనుదిరిగి చూడలేదు. ఈసారి ఐపీఎల్ లో వ్యక్తిగత పరుగుల జాబితాలో టాప్ లో నిలిచాడు యశస్వి జైశ్వాల్(Yeshsvi Jaiswal). ఒకప్పుడు పానీ పూరి అమ్మిన ఈ కుర్రాడు ఇప్పుడు కోట్ల విలువ చేసే ఆటగాడిగా మారి పోయాడు. ఇక ఐపీఎల్ లో మోస్ట్ పాపులర్ ఆటగాడిగా , స్టార్ ఫినిషర్ గా గుర్తింపు పొందాడు రింకూ సింగ్(Rinku Singh). ఆఖరి మ్యాచ్ లో ఒకే ఒక్క పరుగు తేడాతో లక్నో చేతిలో ఓటమి పాలైంది తన జట్టు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడినా ఓటమి నుంచి గట్టెక్కించ లేక పోయాడు.
కానీ తట్టుకోలేక కన్నీటి పర్యంతం అయ్యాడు రింకూ సింగ్. ఇవాళ జాతి మొత్తం అతడిని కీర్తిస్తోంది. ఇంతలా తన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న ఈ కుర్రాడి గురించి ఎంత చెప్పినా తక్కువే. పుట్టుకతోనే పేదరికం. ఆర్థిక సంక్షోభం అతడిని ఇబ్బంది పెట్టింది. రింకూ సింగ్ ది కూడా యూపీ లోని అలీఘర్. 1997లో పుట్టాడు. తండ్రి సైకిల్ పై ఇంటింటికీ సిలిండర్లను పంపిణీ చేసే వాడు. నలుగురు సోదరులు. అంతా కష్టపడితేనే తిండికి గడిచేది. పూరి గుడిసె. ఐపీఎల్ లో ఆడేంత వరకు అతడి పరిస్థితి దారుణంగా ఉంది. కానీ ఏనాడూ స్థైర్యం కోల్పోలేదు రింకూ సింగ్. క్రికెటర్ కావాలన్న అతడి కోరిక..కసిగా మారింది..అద్భుతమైన ఆటగాడిగా మార్చేలా చేసింది.
క్రికెట్ ను ప్రాక్టీస్ చేస్తూ పెరిగాడు. మెల మెల్లగా క్రికెటర్ గా ఆడటం ప్రారంభించాడు. రూ. 5 లక్షల అప్పు ఉండడంతో క్రికెట్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. 2012లో అండర్ -16 కు ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో 154 రన్స్ చేశాడు. 2016లో యూపీ తరపున రంజీకి ఎంపికయ్యాడు. 2018లో ఐపీఎల్ వేలం పాటలో కోల్ కతా ఎంపిక చేసుకుంది. 2023 ఐపీఎల్ సీజన్ లో మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా మారాడు రింకూ సింగ్. అప్పుల్ని తీర్చేశాడు..విజేతగా నిలిచాడు ఈ కుర్రాడు. నేటి తరం కుర్రాళ్లు టెక్నాలజీ మాయలో పడి పోతున్నారు. ఇలాంటి వాళ్లు ఒక్కసారి యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ లను చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది. జీవితం అంటే సుఖం కాదు కలలు..కష్టాలు..కన్నీళ్లు..విజయాలు..కదూ.
Also Read : BS Yedyurappa