కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు చూపించారు యశస్వి జైశ్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్. యంగ్ స్టార్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ మరోసారి రెచ్చి పోతే శాంసన్ తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఏకంగా 2వ వికెట్ కు 121 రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాజస్థాన్ రాయల్స్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అద్భుతంగా రాణించింది. ప్రధానంగా ఫీల్డింగ్ లో సైతం టాప్ లో నిలిచింది. మొత్తంగా కోల్ కతా నైట్ రైడర్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. ప్లే ఆఫ్ రేసు లోకి దూసుకు వెళ్లింది. మెరుగైన రన్ రేట్ తో 3వ స్థానానికి చేరుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి కుప్ప కూలింది కోల్ కతా. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు.
అనంతరం 150 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 13 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసింది. జైశ్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ 29 బంతులు ఎదుర్కొని 47 రన్స్ చేసి ఆట చివరి దాకా ఉన్నాడు.
