Jawaharlal Nehru Comment : దేశం మరువని దార్శనికుడు
భవిష్యత్తుపై చెరగని ముద్ర
Jawaharlal Nehru Comment : భారత దేశ చరిత్రలో చెరగని అధ్యాయం..చిరస్మరణీయం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru). వ్యక్తిగతంగా ఎన్నో అభిప్రాయాలు..భేదాలు ఉండి ఉండవచ్చు. కానీ ఆయనకు ఉన్న దార్శనికత..ముందు చూపును మాత్రం ఎవరూ తప్పు పట్టలేరు. ఇవాళ దేశంలో కీలకమైన రంగాలకు ప్రాణం పోసింది ఆయనే.
మొట్ట మొదటి ప్రధాన మంత్రిగా చరిత్ర సృష్టించిన నెహ్రూ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలహాబాద్ లో పుట్టిన చాచాజిది ఇవాళ పుట్టిన రోజు. మరోసారి ఆ మహానుభావుడిని స్మరించు కోవాల్సిన బాధ్యత దేశం పై ఉంది.
ఉన్నత చదువులు చదివారు. జాతీయ కాంగ్రెస్ లో కీలకమైన నాయకుడిగా ఉన్నారు. మహాత్ముడికి ఇష్టమైన వ్యక్తిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు నెహ్రూ.
జైలులో ఉన్న సమయంలో ఆయన రాసిన లేఖలు, వ్యక్తం చేసిన ఆలోచనలు, రాసిన అక్షరాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. ఆయనలోని పట్టుదలే తన కూతురు ఇందిరా గాంధీకి వచ్చాయి.
ఆమె కూడా దేశంలో ఉక్కు మహిళగా పేరు పొందారు. తుపాకీ గుళ్లకు బలయ్యారు. ఆమె తనయుడు రాజీవ్ గాంధీ దుర్మరణం పాలయ్యాడు. సంజయ్ గాంధీ ని పోగొట్టుకున్నారు.
ప్రస్తుతం మనువడి తరం నడుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు. కానీ ప్రధానమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశానికి మేలు చేకూర్చి పెట్టాయనడంలో సందేహం లేదు.
నెహ్రూ జాతీయవాదం, సోషలిజం, ప్రజాస్వామ్యం, కమ్యూనిజం పట్ల అవగాహన కలిగి ఉన్నారు. మతం పట్ల ఏమంత ప్రాధాన్యత ఇచ్చినట్లు లేదు. ఆయన నాయకుడిగా పేరొందినా రచయితగా కూడా ప్రభావం చూపించారు.
తన అనుభవాలను ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, టువార్డ్ ఫ్రీడం, లెటర్స్ ఫ్రమ ఎ ఫాదర్ టు హిస్ డాటర్ పేరుతో రాశారు.దేశ చరిత్రతో పాటు ప్రపంచ చరిత్ర పట్ల ఆయనకు ఉన్న మక్కువ ఏపాటిదో వీటిని చదివితే తెలుస్తుంది. ఇవాళ మతం తప్ప మరేదీ ముందుకు రావడం లేదు.
కానీ ఆయన దేశం భవిష్యత్తు గురించి ఆలోచించాడు. కలలు కన్నాడు. ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేశారు. ప్రధానిగా దేశీయ , అంతర్జాతీయ విధానాలకు ప్రధాన రూపకర్తగా ఉన్నాడు.
పంచవర్ష ప్రణాళికను ప్రారంభించి ప్రాణం పోసిన ఘనమైన చరిత్ర కూడా నెహ్రూదే. గాంధీని అనుసరించాడు. జైలులో తత్వశాస్త్రం పట్ల మక్కువ పెంచుకున్నాడు. అనంతరం ప్రభావంతమైన జాతీయవాద నాయకుడిగా ఎదిగారు. రష్యా పట్ల ఆకర్షితుడయ్యాడు. సామ్రాజ్యవాదాన్ని నిరసించాడు.
కమ్యూనిస్టులు, సోషలిస్టులతో స్నేహం కలిగి ఉన్నారు. భారత దేశానికి సాంకేతిక, వైజ్ఞానిక రహదారిని నిర్మించాడు. ఇవాళ దేశం స్వావలంబన సాధించడంలో నెహ్రూ పాత్ర కీలకమైనది. సామాజిక, ఆర్థిక సంస్కరణలను అమలు చేశాడు. వేగవంతమైన పారిశ్రామికీకరణకు శ్రీకారం చుట్టాడు నెహ్రూ(Jawaharlal Nehru). అలీన ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచాడు.
ప్రపంచంలో శాంతిని కోరుకున్నాడు. ఆ దిశగా తన పాలన ఉండేలా చూసుకున్నాడు. సామ్యవాదం, డెమోక్రసీ పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. పిల్లలంటే వల్లమాలిన అభిమానం. నవంబర్ 14న ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఐఐటీ, ఎయిమ్స్ , ఇస్రో వంటి వాటికి ఆయనే ఆద్యుడు కావడం విశేషం. భారత దేశానికి దిశా నిర్దేశనం చేసిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇక సెలవంటూ 1964 మే 27న కన్ను మూశారు. సమున్నత భారతం గొప్ప పాలకుడిని..అంతకంటే స్వాప్నికుడిని కోల్పోయింది.
Also Read : బలవంతపు మత మార్పిడులు ప్రమాదం