Nitish Kumar : ఉమ్మడి పోరాటం బీజేపీపై యుద్దం – నితీశ్
మాది థర్డ్ ఫ్రంట్ కాదు మెయిన్ ఫ్రంట్
Nitish Kumar : దేశం తమదని అనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. కులం, ప్రాంతం, మతం పేరుతో రాజకీయాలు నెరుపుతోంది. ఎన్నికల సమయంలో ఏదో ఒక సున్నితమైన అంశాలను లేవనెత్తడం దాని ద్వారా లబ్ది పొందడం జరుగుతోంది.
దీనిని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్.
బీజేపీతో ఉన్న 17 ఏళ్ల బంధాన్ని తెంచుకున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తన పొలిటికల్ కెరీర్ లో ఎన్నో పదవులు నిర్వహించారు.
బీహార్ చరిత్రలో ఎనిమిదోసారి సీఎంగా కొలువుతీరారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పనిలో పడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
నితీశ్ కుమార్ ను సీఎం కేసీఆర్(CM KCR) కలిశారు. అనంతరం జేడీయూ చీఫ్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ, ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరిని కలిశారు.
అన్ని పార్టీలు ఒక్కటి కావాలని కోరుతున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ, శరద్ పవార్ ప్రయత్నం చేసినా అంతగా వర్కవుట్ కాలేదు. తాజాగా
నితీశ్ కుమార్(Nitish Kumar) కొంత మేరకు సక్సెస్ అయ్యారనే చెప్పక తప్పదు.
తమది థర్డ్ ఫ్రంట్ కాదని మెయిన్ ఫ్రంట్ అని స్పష్టం చేశారు జేడీయూ చీఫ్. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెయిన్ ఫ్రంట్ కోసం బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
కాగా ఎవరు నాయకత్వం వహిస్తారనేది ఇప్పుడు చర్చ అనవసరమని పేర్కొన్నారు.
Also Read : ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు