Justice Madan Lokur Comment : ఇదేమి న్యాయం అన్యాయం
మాజీ జస్టిస్ లోకూర్ కు సలాం
Justice Madan Lokur Comment : అన్యాయాన్ని ప్రశ్నించ లేని సమాజం ఎందుకుండాలి. దానిని ఎందుకు భరించాలి. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే. ఇలాగేనా న్యాయ వ్యవస్థ వ్యవహరించేది. వ్యవస్థలు పక్కదారి పట్టినప్పుడు, నేరస్థులు పాలకులై పేట్రేగుతున్నప్పుడు, సభ్య సమాజం నిద్ర పోతున్నప్పుడు మేల్కోవాల్సింది, పక్కదారి పట్టకుండా దిశా నిర్దేశం చేయాల్సిన సమయంలో మౌనం వహించడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఇది ఎప్పటికీ ఉండకూడదు. వ్యవస్థలు నిర్వీర్యమై పోతున్న వేళ ఒక్క గొంతుకైనా న్యాయం కోసం ఆక్రోశిస్తుంటే మనం ఉండీ ఏం లాభం. మనం బతికి ఉండీ ఏం ప్రయోజనం. ఇదేనా భారతీయం అంటే..ఇదేనా జాతీయత అంటే..ఇదేనా మనకు నేర్పిన సంస్కృతి అంటూ నిప్పు కణికల్లాంటి నిజాలను నిర్భయంగా చాటి చెప్పిన ఆ వ్యక్తి నక్సలైట్ అనుకుంటే పొరపాటు పడినట్లే. ఆయన ఎవరో కాదు ఈ దేశంలో అత్యున్నతంగా భావించే సర్వోన్నత న్యాయ స్థానంలో పని చేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ మదన్ బి లోకూర్(Madan Lokur).
సంచలన తీర్పులకు పెట్టింది పేరు. తను పని చేసినంత కాలం నిబద్దతతో వృత్తికి న్యాయం చేకూర్చిన వ్యక్తి. నేరస్థులకు, అక్రమార్కులకు, అవినీతి పరులకు శిక్షలు ఖరారు చేయడంలో, న్యాయం వైపు నిలిచేలా తీర్పులు చెప్పడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు లోకూర్. ఇవాళ ఆయన మరోసారి చర్చకు దారి తీసేలా చేశారు. ఏ దేశానికైనా న్యాయ వ్యవస్థ రెండు కళ్లు లాంటిది. అది గనుక మూసుకుంటే ఇక మిగిలేది శూన్యమే. జస్టిస్ లోకూర్(Madan Lokur) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా ఖాకీల కండకావరాన్ని తప్పు పట్టారు. ఆపై న్యాయ వ్యవస్థ ఇంకా ఎందుకు మౌనం వహించందనే ప్రశ్నల్ని సంధించారు. ఒక రకంగా నిలదీశారు. మీరంతా ఏమరుపాటుగా ఉండక పోతే గతి తప్పిన పాలకులు రెచ్చి పోతారని హెచ్చరించారు. అంతే కాదు దేశంలో సగ భాగమైన ఆడ పిల్లల పట్ల ఇంతటి అమానుషత్వం ప్రదర్శించడం దారుణమని పేర్కొన్నారు. జస్టిస్ లోకూర్ లేవదీసిన ప్రశ్నలు , ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇవాళ సూదుల్లా గుచ్చుకుంటున్నాయి.
టెక్నాలజీ మారింది. కానీ మనం ఇంకా మనుషులుగా ఎందుకు కాలేక పోతున్నామంటూ ఆవేదన చెందారు. జస్టిస్ ప్రధానంగా లేవ దీసింది..నిలదీసింది మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళన గురించి. భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై సంచలన ఆరోపణలు చేసినా , కేసులు నమోదు చేసినా ఎందుకని చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడ్డారు. ఆపై దేశానికి పతకాలు తీసుకు వచ్చి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారిణుల పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారంటూ నిప్పులు చెరిగారు జస్టిస్ మదన్ బి లోకూర్(Madan Lokur). ఇది ఎంత మాత్రం క్షేమకరం కాదని స్పష్టం చేశారు. జస్టిస్ లేవదీసిన ఈ ప్రశ్నలు ఈ ఒక్క అంశానికి మాత్రమే అనుకుంటే పొరపాటు పడినట్లే . ప్రతి రంగంలో ఇలాంటి సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో, రాజకీయం పేరుతో ఎక్కడో ఒక చోట రక్తపు చుక్కలు రాలుతూనే ఉన్నాయి. జస్టిస్ ఆవేదనలో అర్థం ఉంది..అంతకు మించిన బాధ ఉంది. న్యాయం ఆక్రోశానికి లోనైతే వ్యవస్థ తట్టుకోగలదా. ఆలోచించాలి. పదవులను అడ్డం పెట్టుకుని అదే ప్రపంచమని ఊరేగుతున్న ఈ కాలంలో న్యాయం వైపు తన గొంతును వినిపిస్తున్న జస్టిస్ మదన్ బి లోకూర్ కు మనం రుణపడి ఉన్నాం.
Also Read : Telangana Awards : తెలంగాణకు అవార్డుల పంట
